
ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు, అమ్మకాలకు పాల్పడుతున్న గవర్నమెంట్ టీచర్‌తో పాటు అతడి భార్యను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని పీహెచ్‌సీ కాలనీకి చెందిన ఆరేవార్ రాజన్న సర్వే నంబర్ 68/54/4లో నాలుగు ప్లాట్లను గతేడాది గుగులోతు బాపురావు అనే టీచర్ వద్ద కొనుగోలు చేశాడు.
ఆ ప్లాట్లకు ఫెన్సింగ్ వేసేందుకు ఇటీవల వెళ్లగా.. అప్పటికే ప్లాట్ల చుట్టూ ఫెన్సింగ్ కనిపించింది. వివరాలు తెలుసుకోగా.. ఆ ప్లాట్లు వేరే వారి పేరున ఉన్నాయని.. టీచర్ బాపురావు నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను అమ్మాడని తెలిసింది. దీంతో మంగళవారం ఆదిలాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాపురావు అతడి భార్య అంబికతో పాటు దాసరి జ్యోతి, గొడ్డెంల శ్రీనివాస్, పాలెపు శ్రీనివాస్, మల్లేపల్లి భూమన్నలపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.