
ప్రయాగ్‌రాజ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ యశ్ దయాల్ తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై స్పందించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధిస్తున్నాడని ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ అతనిపై కేసు పెట్టింది. అయితే, ఆ అమ్మాయే తనను మోసం చేసిందని దయాల్ అంటున్నాడు.
వైద్య ఖర్చులు, షాపింగ్ కోసం తన వద్ద నుంచి లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వని సదరు మహిళపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఆమె తన ఐఫోన్, ల్యాప్‌టాప్ కూడా దొంగిలించిందని మూడు పేజీల ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పాడు. ఈ క్రమంలో తనకు, తన ఫ్యామిలీ వైద్య ఖర్చుల పేరుతో ఆమె లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందన్నాడు.
తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఇవ్వలేదని యశ్ ఆరోపించాడు. అలాగే, షాపింగ్ కోసం కూడా చాలాసార్లు డబ్బు తీసుకుందని పేర్కొన్నాడు. వీటికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపాడు. ఘజియాబాద్ పోలీసులు తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిసిన తర్వాత తాను కూడా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దయాల్ చెప్పాడు.
సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు, మరికొందరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఐదేళ్లుగా సంబంధంలో ఉన్న యశ్ తనను శారీరకంగా వేధించాడని ఆరోపిస్తూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు వివిధ సెక్షన్ల కింద దయాల్‌పై ఎఫ్‌ఆర్ నమోదు చేశారు.