
విండ్‌హూక్ (నమీబియా): నమీబియా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్’అవార్డును ప్రధాని మోదీ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రభుత్వానికి, నమీబియా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును ఇండియా, నమీబియా ప్రజలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న విడదీయరాని స్నేహానికి అంకితం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, కీలకమైన ఖనిజాలు వంటి రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇండియా యూపీఐ సిస్టమ్‌ను స్వీకరించిన మొదటి దేశంగా నమీబియా అవతరించింది. దీనికి సంబంధించి లైసెన్సింగ్ ఒప్పందంపై ఎన్‌పీసీఐ సంతకం చేసింది. అంతకుముందు ఆ దేశ పర్యటనపై మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘భారత్‌కు ఆఫ్రికాలో నమీబియా విలువైన, విశ్వసనీయ భాగస్వామి దేశం. వారితో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాం. నమీబియా ప్రెసిడెంట్ డాక్టర్ నెతుంబో నంది ద్వైత్వాను కలవడానికి వచ్చాను. అలాగే, ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను”అని పేర్కొన్నారు.