
న్యూఢిల్లీ, వెలుగు: గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరో విజయ్ దేవరకొండపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులకు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘రెట్రో’ సినిమా ఈవెంట్‌కు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏండ్ల క్రితం బుద్ధి లేకుండా ట్రైబల్స్ కొట్టుకున్నట్లు, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’’ అంటూ కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ గత నెల 17న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌తో పాటు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తమ ముందు హాజరుకావాలని పిటిషనర్, పోలీసులకు జులై 1న ఎస్టీ కమిషన్ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ముందు అశోక్ కుమార్ రాథోడ్, పోలీసుల తరఫున మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.