
- ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకు నితీశ్ సర్కారు ప్లాన్
- ఈసీకి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాకు హాజరైన కాంగ్రెస్ ఎంపీ
పాట్నా: బిహార్లో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతున్నదని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ తరహాలో బిహార్‌లోనూ ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు నితీశ్ సర్కారు ప్లాన్ చేస్తున్నదని అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించాలన్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం ప్రతిపక్షాలు చేపట్టిన ‘బిహార్ బంద్’లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఓటరు జాబితాలో తమవారి ఓట్లు మాత్రమే ఉండేలా అధికార పార్టీ ఓటరు జాబితా సవరణ చేస్తున్నదని అన్నారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేశారు. అదే విధానాన్ని బిహార్‌లోనూ పునరావృతం చేయాలనుకుంటున్నారు. దానిని మేం అనుమతించం” అని పేర్కొన్నారు.
బీజేపీ సూచనలతోనే ఈసీ పనిచేస్తున్నది..
రాజ్యాంగ విలువలను రక్షించాల్సిన ఎన్నికల కమిషన్.. తన బాధ్యతలు మరిచి బీజేపీ సూచనల మేరకు పని చేస్తున్నదని రాహుల్‌గాంధీ విమర్శించారు. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ఇండియా కూటమికి మెజారిటీ ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించాయని, కానీ తాము ఆయా ఎన్నికల్లో పరాజయం పాలయ్యామని తెలిపారు. అనంతరం ఓటర్ల లిస్ట్‌లను పరిశీలిస్తే దాదాపు కోటి మంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
ఈ ఓట్లను ఎన్నికలకు వారంముందే కొత్తగా చేర్చినట్టు తాము గుర్తించామన్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత తాము ఓటర్ లిస్ట్ అడిగినా ఈసీ అధికారులు ఇప్పటివరకూ అందించలేదన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ ఎలక్టోరల్ రోల్స్ సవరణ అనేది ఎన్నికలను దొంగిలించే ప్రయత్నమని, ఓటర్ల హక్కులను కాలరాస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈసీ నిర్ణయంపై ప్రతిపక్షాల ఆందోళన
బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రధానంగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కూటమి నేతలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తంచేశారు. సోన్‌పూర్, హాజీపూర్‌లో రోడ్లను దిగ్బంధించారు. రైల్వే ట్రాక్‌లపై కూర్చొని.. నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, పప్పు యాదవ్ తదతరులు పాల్గొన్నారు.