
- ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ పై త్వరలో ప్రధానిని, గడ్కరీని కలుస్తం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ కేటగిరీలుగా ప్రాధాన్యతా క్రమంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో స్టార్ట్ చేయనున్న హ్యామ్ ప్రాజెక్టుతో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ కీలకం కానుందన్నారు.
హ్యామ్ రోడ్ల ప్యాకేజీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన తర్వాత టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో రోడ్ ప్యాకేజీల వివరాలపై చర్చించారు. ఎన్ హెచ్ ఏ ఐ నార్మ్స్ ప్రకారం పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తూ హ్యామ్ రోడ్ల నిర్మాణం చేస్తామని, పదేండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా క్వాలిటీ పాటించేలా వర్క్ ఏజెన్సీలకు ముందుగానే తెలపాలన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు.
ఈ రివ్యూలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీ జయభారతి, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, మోహన్ నాయక్, ఎస్ఈ ధర్మారెడ్డి, మోర్త్ ఆర్ వో కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. హ్యామ్ ప్రాజెక్టులో ఫీల్డ్ విజిట్ చేస్తూ క్వాలిటీ చెక్ చేయడమే కాకుండా లో లెవెల్ బ్రిడ్జి, హై లెవల్ బ్రిడ్జి లాంటివి ముందే ఐడెంటిఫై చేసి భవిష్యత్ లో ప్రమాదాలు జరగకుండా, రవాణాకు అసౌకర్యం లేకుండా కన్సల్టెంట్ టీంలతో సంప్రదించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 శాతం రోడ్లు కవర్ అవుతాయని, ఈ ప్రాజెక్టును అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ ను ఆమోదించడంతో పాటు సౌత్ పార్ట్ ను మంజూరు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధానిని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని మంత్రి వెల్లడించారు. విజయవాడ హైవే పై బ్లాక్ స్పాట్ల నిర్మాణం స్పీడప్ చేయాలని, మదీనాగూడ నుంచి సంగారెడ్డి 6 లైన్ల విస్తరణ పనులు స్పీడప్ చేయాలని మంత్రి ఆదేశించారు. టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, పలు ఆర్వోబీల నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలనిఅధికారులను మంత్రి ఆదేశించారు.