పటాన్చెరు మండలంలోని హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

పటాన్చెరు మండలంలోని  హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

పటాన్​చెరు, వెలుగు: మండలంలోని రుద్రారం హనుమాన్ ఆలయంలో స్వామివారి విగ్రహంతోపాటు నంది విగ్రహం ధ్వంసమవడం శుక్రవారం ఉద్రిక్తతతకు దారితీసింది. కారకులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్, బీజేపీ మండల అంధ్యక్షుడు కావలి వీరేశం, నాయకులు ఆందోళన చేపట్టారు.  డీఎస్పీ ప్రభాకర్​సంఘటన స్థలానికి చేరుకొని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

అక్కడే ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తే  విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నామని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామన్నారు. దీనికి మతిస్థిమితం లేని వ్యక్తి ఆలయంలోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేస్తాడా అని నాయకులు ప్రశ్నించారు. నేరస్తులకు శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

విగ్రహాల ధ్వంసం దురదృష్టకరం : ఎమ్మెల్యే

విగ్రహాల ధ్వంసం దురదృష్టకరమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆలయానికి చేరుకొని, పరిశీలించారు. త్వరలో కొత్త విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తామని తెలిపారు.

చర్యలు తీసుకోవాలి : ఎంపీ

రుద్రారం హనుమాన్ ఆలయంలో విగ్రహాల ధ్వంసంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చి, విగ్రహాలను పరిశీలించారు. వాటిని ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులున్నారు.