గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

 చిన్నచింతకుంట, వెలుగు: ఆసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్  విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం దేవరకద్ర పీహెచ్​సీని కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్  పరిశీలించిన అనంతరం, ప్రసవాలు, మందుల కొరత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ స్కూల్​ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు.

 పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, వాటిని పేరెంట్స్​కు వివరించి విద్యార్థుల నమోదు పెరిగేలా చూడాలన్నారు. అనంతరం దేవరకద్ర మండలం వినుగొనిపల్లి గ్రామంలో జిల్లాలో మొదటిసారి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న విజయతో మాట్లాడారు.

. లబ్ధిదారురాలుతో కలిసి ఇల్లు, వంట గదిని పరిశీలించి, ఇల్లు చాలా బాగుందని అభినందించారు. దేవరకద్ర కేజీబీవీని సందర్శించి 8వ తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. స్టోర్  రూమ్, వంట గది, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట డీఈవో ప్రవీణ్ కుమార్, తహసీల్దార్  కృష్ణయ్య, మండల అధికారులు పాల్గొన్నారు.