
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- కాంగ్రెస్ అదిలాబాద్ లోక్‌సభ ఇన్చార్జ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
నిర్మల్, వెలుగు: రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతుండడం చరిత్రాత్మకమని కాంగ్రెస్ ఆదిలాబాద్ లోక్‌సభ ఇన్చార్జ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిర్మల్‌లోని ఓహోటల్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని, ఇందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుంచడమే పార్టీ ధ్యేయమన్నారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేఖ నాయక్, విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమరెడ్డి, హాది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
పార్టీని నమ్ముకున్న వారిని పదవులు వరిస్తాయి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కాంగ్రెస్ జెండాను మోసి, పార్టీ అభివృద్ధికి కష్టపడ్డ వారికి పదవులు తప్పక వరిస్తాయని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందని, కష్టపడి పనిచేసేవారికి అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ చైర్మెన్ భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ కార్యదర్శి, అడిషనల్ ఇన్చార్జి ఇంద్రకరణ్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్నరేశ్ జాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, బోథ్, నియోజకవర్గ ఇంచార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.