ముత్తిరెడ్డి అక్రమ నిర్మాణంపై అఖిలపక్షం పోరాటం..

ముత్తిరెడ్డి అక్రమ నిర్మాణంపై అఖిలపక్షం పోరాటం..

సిద్దిపేట, వెలుగు: చేర్యాల పెద్దచెరువు బఫర్ జోన్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పెద్దచెరువు పరిరక్షణ  సమితి పేరిట  చేర్యాల బంద్​ నిర్వహించిన నేతలు మరోసారి మున్సిపల్​ఆఫీస్​ ముట్టడికి సిద్ధం అవుతున్నారు. ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాల్సిన చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలంలో కట్టకు  సమాంతరంగా నిర్మిస్తున్న  కాల్వ పనులను  నిలిపివేయాలని, బఫర్ జోన్ లో  అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేసి ఆ స్థలాన్ని మున్సిపాల్టీ  స్వాధీనం  చేసుకోవాలనే డిమాండ్​తో చేర్యాల జేఏసీ సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్​ఆఫీస్​ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ అంశంపై అధికార టీఆర్ఎస్​ పార్టీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, స్టూడెంట్​యూనియన్లు, వర్తక వాణిజ్య సంఘాలు అఖిలపక్ష కమిటీగా ఏర్పడి ఆందోళనలో పాల్గొంటున్నాయి. పెద్ద చెరువు బఫర్ జోన్ స్థలంపై సుదీర్ఘంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుండటంతో ఆఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాలలో శనివారం ప్రత్యేకంగా ఆఫీస్​ను సైతం ప్రారంభించారు.

పోలీసుల హెచ్చరికలు

చేర్యాల మున్సిపాల్టీ ముట్టడికి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని, ఎలాంటి ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన చేర్యాల బంద్​ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సిటీ పోలీస్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో సోమవారం ఏం జరగబోతుందనే చర్చ చేర్యాలలో మొదలైంది.

ప్రజావసరాల కోసమే  ఉపయోగించాలె

చేర్యాల పెద్ద చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణంతో పాటు కాలువ నిర్మాణాన్ని ఆపాలి. బఫర్​జోన్  స్థలాన్ని ప్రజా అవసరాల కోసమే ఉపయోగించాలి. దశాబ్దాలుగా ఆ స్థలాన్ని పశువుల అంగడితో పాటు పట్టణ ప్రజల అవసరాలకు వినియోగించుకుంటున్నారు. చేర్యాల మున్సిపాల్టీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా అధికారులు వారికేం పట్టనట్లు ఉన్నారు. పెద్ద చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం విషయంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాం. ఈ ఆందోళనకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

– భైరవభట్ల చక్రధర్, చేర్యాల జేఏసీ చైర్మన్