2024లో బీజేపీని గద్దె దించాలి

2024లో బీజేపీని గద్దె దించాలి

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్  మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు..సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా నరేశ్ ఉత్తమ్ పటేల్ ఎన్నికయ్యారు.  ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్ళలో ఎస్పీ జాతీయ పార్టీగా ఎదగడానికి కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలు SPకే ఓటు వేశారని.. అయినప్పటికీ తమ నుంచి ప్రభుత్వాన్ని బీజేపీ లాక్కుందని ఆరోపించారు.  అధికారాన్ని దుర్వినియోగం చేసి.. తప్పుడు మార్గాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు.

యూపీలో ఓడితే కేంద్రంలో ఓడినట్లే..
కేంద్ర ఎన్నికల కమిషన్పై తమకు గౌరవముందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ECI  బీజేపీ బూత్ ఇన్‌ఛార్జిలకు కొమ్ముకాసిందని ఆరోపించారు. యూపీలో అధికారాన్ని కోల్పోతే...కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినట్లే అని భావించే...బీజేపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో..బూత్ స్థాయిలో పటిష్టంగా తయారవ్వాలని సూచించారు. జైళ్లకు వెళ్లా్ల్సి వచ్చినా.. తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయన్నారు. బీజేపీ ప్రభుత్వాలు వ్యవస్థలను కబ్జా చేశాయని చెప్పారు.

పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ...
బీజేపీ నేతలు అబద్ధాలకోరులని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వారికి  పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని విమర్శించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా బీజేపీ నేతలు అబద్దాలు ఆపేలా చేయాలని దుర్గామాతను కోరుకుంటున్నట్లు చెప్పారు. అన్నదాతలు ఇబ్బందుల్లో..వారికి రుణమాఫీ చేయడం లేదన్నారు. గుజరాతీ వ్యాపారులకే రుణమాఫీలు అందుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం..గుజరాత్ కే పరిశ్రమలను తీసుకెళ్తుందన్నారు. యూపీకి పరిశ్రమలను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.