లోక్‌సభ ఎన్నికలు : కాంగ్రెస్‌కు 17 సీట్లు ఆఫర్ చేసిన అఖిలేష్ యాదవ్

 లోక్‌సభ ఎన్నికలు  : కాంగ్రెస్‌కు 17 సీట్లు ఆఫర్ చేసిన అఖిలేష్ యాదవ్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌కు 17 సీట్లు ఆఫర్ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది.  అయితే ఈ ఆఫర్‌పై కాంగ్రెస్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ 80 లోక్‌సభ స్థానాల్లో 11 సీట్లను కాంగ్రెస్‌కు ఆఫర్ చేసింది. 

ఫైనల్ గా కాంగ్రెస్‌ పార్టీకి 17 సీట్లు ఆఫర్ చేశాం. కాంగ్రెస్ అంగీకారాన్ని బట్టే రాయబరేలిలో రాహుల్ మంగళవారం జరిపే భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ పాల్గొనడం ఉంటుందని  సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ కు ఏయే సీట్లు ఆఫర్ చేశారన్న దానిపై రాజేంద్ర చౌదరి చెప్పేందుకు నిరాకరించారు. 

 కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన  భారత్ జోడో న్యాయ్ యాత్ర సోమవారం అమేథీలోకి ఎంట్రీ ఇచ్చింది.  మంగళవారం రాయబరేలి వెళ్తుంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని అఖిలేష్ గతంలో స్వాగతిస్తూ రాయబేరిలిలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా ..  లోక్‌సభ ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ సోమవారం ప్రకటించింది.  గ్యాంగ్‌స్టర్ నుంచి  రాజకీయ నాయకుడిగా మారిన  ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీని ఘాజీపూర్‌ నుంచి, హరేంద్ర మాలిక్‌ను ముజఫర్‌నగర్‌ నుంచి పార్టీ బరిలోకి దింపింది.  16 మంది అభ్యర్థులతో ఇప్పటికే  ఎస్పీ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.