
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాటేందుకు అఖిలేష్ ప్రయత్నించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 5న ఈ ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలోకి దిగారు.
ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి కంచుకోట అయిన సైఫైలో ఆదివారం ఎస్పీ ఎన్నికల సభ జరిగింది. ఆక్కడ ఏర్పాటు చేసిన సభలో వేదిక పైకి వచ్చిన శివపాల్ యాదవ్ పాదాలకు అఖిలేష్ నమస్కరించారు. 'నేతాజీ' (ములాయం సింగ్ యాదవ్) మన మధ్య లేని తరుణంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అఖిలేష్ .. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మెయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు. ములాయం సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే కావడం గమనార్హం. శివపాల్ సింగ్ యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గమైన జస్వంత్‌నగర్, అఖిలేష్ అసెంబ్లీ నియోజకవర్గమైన కర్హల్.. మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం కిందికే వస్తాయి.