నటిగా గొప్ప తృప్తిని ఇచ్చిన చిత్రం 'ఒకే ఒక జీవితం' 

నటిగా గొప్ప తృప్తిని ఇచ్చిన చిత్రం 'ఒకే ఒక జీవితం' 

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘ఒకే ఒక జీవితం’. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్కినేని అమల, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమల ప్రెస్ మీట్ లో సినిమా సక్సెస్ విశేషాలను పంచుకున్నారు.

* 'ఒకే ఒక జీవితం' చూసిన తర్వాత ఎమోషనల్ మదర్ పాత్రలకు మీరే కరెక్ట్ ఛాయిస్ అంటున్నారు. భవిష్యత్ లో ఇలాంటి పాత్రలు చేస్తారా..?
అమల : ఒక నటిగా ప్రేక్షకులకు నచ్చడం కంటే గొప్ప విషయం ఏముటుంది. ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయితే.. ఇలాంటి పాత్రలు చేయడం సవాల్ తో కూడుకున్నది.

* లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ తర్వాత విరామం రావాడానికి కారణం...? 
అమల : లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరిస్ చేశాను. ప్రతి భాషలోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ, తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఇదే. అయితే.. గత ఐదేళ్ళుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియాను నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్ధుల భవిష్యత్ బాధ్యత నాపై ఉంది. ఈ బాధ్యతను పక్కని పెట్టి నటనలో బిజీగా ఉండటం కష్టం. అయితే.. నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ‘ఒకే ఒక జీవితం’ అలా నా మనసుకు నచ్చిన కథే. ఒక నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది. ‘ఒకే ఒక జీవితం’ మూవీ మరోసారి దాన్ని నిరూపించింది. 

* సినిమా చూసిన తర్వాత నాగార్జున ఎమోషనల్ గా మాట్లాడటం మీకు ఎలా అనిపించింది..? 
అమల : 'ఒకే ఒక జీవితం' హృదయాన్ని హత్తుకునే సినిమా అని నాగార్జునను ముందే ప్రిపేర్ చేశాను. ఈ సినిమా చూశాక హార్ట్ ఓపెన్ అవుతుందని చెప్పాను. నాగార్జునకు వారి అమ్మగారు అన్నపూర్ణమ్మ గుర్తుకువచ్చారు. నిజంగా అది గ్రేట్ ఫీలింగ్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వారి మనసులకు దగ్గరరైన వారు గుర్తుకు వస్తారు. 'ఒకే ఒక జీవితం'లోని బ్యూటీ అదే.

* టైం మిషన్ లో వెళ్లే అవకాశం వస్తే ఏ టైంలోకి వెళ్తారు..? 
అమల :  పదేళ్ళు భవిష్యత్ లోకి వెళ్తాను (నవ్వుతూ). ఇప్పుడు చాలా పనులు చేస్తున్నాం. ఆ పనులు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో చూడాలని ఉంది. అవి విజయాన్ని సాధించాయో లేదో తెలుసుకోవాలని ఉంది. (నవ్వుతూ)

* విధి, కాలంని నిజ జీవితంలో ఎలా నిర్వచిస్తారు, విధితో సంబంధం లేకుండా మనిషి తన జీవితాన్ని గెలుచుకోగలడా..?
అమల : జీవితంలో ప్రతి అవకాశం కోసం ప్రయత్నిస్తాం. ఒక ప్రయత్నంలో విజయం, మరో ప్రయత్నంలో అపజయం ఉంటుంది. అపజయం, జయం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. జీవితంలో జయానికి, అపజయానికి సమానమైన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తాను. అపజయం చాలా విషయాల్ని నేర్పిస్తుంది. లైఫ్ టైమ్ ను ఒక రిహార్సల్ గా భావిస్తే సరైన సమయం వస్తుందని నా ఆలోచన. ఇలాంటి ఒక సక్సెస్ రావడానికి నేను చాలా ప్రయత్నాలు చేసి ఉంటాను. కొన్ని ప్రయత్నాలు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ, ఆ అనుభవాలన్నీ విజయానికి బాటలు వేస్తాయని భావిస్తాను.

* తెరపై మీ పాత్ర చుసుకున్నపుడు మీ అమ్మగారితో ఉన్న జ్ఞాపకాలు మీకు గుర్తుకు వచ్చాయా..? 
అమల : ఈ సినిమా చూసి మా అమ్మ నన్ను చాలా గట్టిగా కౌగలించుకుకొని 'ఐ యామ్ సో ప్రౌడ్  అఫ్ యూ' అన్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాగార్జునతో పాటు అఖిల్ , మా కుటుంబ సభ్యులందరూ ఈ సినిమాకు చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా 'ఒకే ఒక జీవితం.

*  ‘బ్లూ క్రాస్’ సంస్థ పనులు చూసుకోవడానికి సమయం కుదురుతుందా.. ?
అమల : బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్ మెంట్, సిబ్బంది ఉంది. బ్లూ క్రాస్ గొప్ప స్థాయికి వచ్చింది. నేను ఉన్నా లేకపోయినా కూడా అద్భుతమైన సేవలు అందిస్తుంది. అయితే.. నా తరపు నుండి ప్రతి శనివారం స్వచ్చందంగా వెళ్లి పని చేస్తాను.

* ఇంట్లో సినిమాలు గురించి మాట్లాడుతుంటారా.. ?
అమల : నాగార్జున, చైతన్య, అఖిల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్లానింగ్స్ గురించి మాట్లాడుతుంటారు. నేను వింటాను. అయితే ఫిల్మ్ స్కూల్ లో ఎక్కువగా సినిమాలు గురించి చర్చిస్తుంటాం. విద్యార్ధులతో కలసి సినిమా గురించి లోతైన విశ్లేషణలు ఫిల్మ్ స్కూల్ లోనే ఎక్కువగా జరుపుతుంటాం.

* నాగార్జునతో మీరు కలసి నటించే అవకాశం వస్తే చేస్తారా..?
అమల : ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్ పై వద్దండీ( నవ్వుతూ). ఈ మధ్య ఆయన నటించిన బ్రహ్మాస్త్రం మూవీ చూశాను. నాకు చాలా నచ్చింది. నాగార్జున పాత్ర సమయమే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముంబాయి నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.