టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ట్రెండ్ సెట్టర్ మూవీ 'శివ' . 1989 వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆర్జీవీ, నాగ్ కెరీర్ నే మార్చేసి ప్రసంశలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 14న 4K రీమాస్టర్డ్ వెర్షన్ లో థియేటర్లలోకి తిరిగి రాబోలోంది. తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిన ఈ మూవీ రీరిలీజ్ సందర్భంగా.. నాగార్జున ఆసక్తికర విషయాలతో పాటు తన భావోద్వేగాలను పంచుకున్నారు.
కొత్త సినిమా చూసినట్లే ఉంది..
తన కెరీర్‌లో అత్యంత విలువైన చిత్రంగా 'శివ'ను అందించినందుకు దర్శకుడు RGVకి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం 'శివ'ను మళ్లీ చూసినప్పుడు, అది పూర్తిగా కొత్త సినిమా చూసిన అనుభూతినిచ్చింది. నిజంగా అది జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అనుభవం అని తెలిపారు. 'శివ' విడుదలై భారీ విజయం సాధించినప్పుడు దివంగత తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ANR) ఎలా స్పందించారో కూడా నాగార్జున గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత నాన్న చూశారు. అప్పటికే రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నా.. ఆయన మాత్రం నన్ను కారులోడ్రైవ్‌కు తీసుకెళ్లి, 'ఈ సినిమా చాలా పెద్ద హిట్' అని చెప్పారని ఆనాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
నాగ చైతన్య, అఖిల్ రీమేక్ చేయలేరు..
'శివ'ను తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని రీమేక్ చేసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు.. నాగార్జున నవ్వుతూ స్పందించారు. 'చై, అఖిల్‌లకు 'శివ' రీమేక్ చేసేంత ధైర్యం లేదు అని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సినిమా ప్రభావాన్ని, ప్రత్యేకతను మళ్లీ తెరపైకి తీసుకురావడం అసాధ్యమనే భావన ఆయన మాటల్లో వినిపించారు. కానీ తన భార్య అమలతో కలిసి భవిష్యత్తులో మళ్లీ ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని తాను కోరుకుంటున్నట్లు నాగార్జున తన మనసులో మాటను తెలిపారు.
కెరీర్ కే టర్నింగ్ పాయింట్
అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, SS క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ 'శివ ' చిత్రం రామ్ గోపాల్ వర్మకు దర్శకుడిగా తొలి చిత్రం. ఈ మూవీలో శివ (నాగార్జున), ఆశ (అమల) విద్యార్థులుగా నటించిన ఈ సినిమాలో క్యాంపస్ పాలిటిక్స్, హింసను అత్యంత వాస్తవికంగా చూపించి తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ముఖ్యంగా నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా 'శివ' నిలిచింది. ఇప్పుడు మరింత కొత్తగా 'శివ' విడుదల చేస్తున్నారు. దీంతో 4K రీ-రిలీజ్ ద్వారా పాత, కొత్త తరాల ప్రేక్షకులు ఈ విప్లవాత్మక క్లాసిక్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం లభించింది.
