అక్షర చిట్‍ఫండ్‍ డైరెక్టర్‍ శ్రీవిద్య అరెస్ట్: కస్టమర్లను మోసం చేసి విదేశాలకు వెళ్లే క్రమంలో పట్టివేత

అక్షర చిట్‍ఫండ్‍ డైరెక్టర్‍ శ్రీవిద్య అరెస్ట్: కస్టమర్లను మోసం చేసి విదేశాలకు వెళ్లే క్రమంలో పట్టివేత

వరంగల్‍, వెలుగు: కస్టమర్లను మోసం చేసి విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన అక్షర చిట్‍ఫండ్‍ డైరెక్టర్‍ పేరాల శ్రీవిద్యను పోలీసులు శనివారం అరెస్ట్  చేశారు. గ్రేటర్‍ వరంగల్‍, హనుమకొండ నక్కలగుట్టలో చిట్​ఫండ్  ఆఫీస్‍ ఏర్పాటు చేసి పేరాల శ్రీనివాస్‍రావు నాలుగేండ్లుగా వందలాది మందికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో బాధితులు చిట్‍ఫండ్‍ ముందు ఆందోళనకు దిగారు. దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో అతనిపై సుబేదారి పోలీస్‍ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి.

శ్రీనివాస్‍రావు తన భార్య శ్రీవిద్యను డైరెక్టర్​గా చూపడంతో ఆమెపై 2022లో సుబేదారి పీఎస్​లో కేసు నమోదైంది. శ్రీనివాస్​తో పాటు శ్రీవిద్య సిటీ నుంచి పరారీలో ఉన్నారు. ఈక్రమంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు లుక్‍ఔట్‍ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీవిద్య బెంగళూరు నుంచి విదేశాలకు వెళుతున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను అరెస్ట్  చేశారు. రాత్రి నగరానికి తీసుకొచిన పోలీసులు, కోర్టు ఆదేశాలతో ఆమెను నర్సంపేట సబ్‍  జైల్‍కు తరలించారు. ఆమె భర్త శ్రీనివాస్‍రావు ఇంకా పరారీలో ఉన్నాడు.