మూసీ ప్రక్షాళనకు కొట్లాడుదాం రండి : ఆకునూరి మురళి

మూసీ ప్రక్షాళనకు కొట్లాడుదాం రండి : ఆకునూరి మురళి

హైదరాబాద్ వాసులకు ఆకునూరి మురళి పిలుపు  
ఇయ్యాల లిబర్టీ నుంచి లక్డీకాపూల్ వరకు పాదయాత్ర 

హైదరాబాద్, వెలుగు : మూసీ నది ప్రక్షాళన కోసం పోరాడేందుకు హైదరాబాద్ నగర ప్రజలు ముందుకు రావాలని రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) కన్వీనర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం సొసైటీ ఫర్ ఎర్త్‌‌ జస్టిస్ ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళన కోసం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దాకా నిర్వహించిన పాదయాత్రలో మురళి  పాల్గొని మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళనపై అనేక ప్రకటనలు చేసిన కేసీఆర్.. దాన్ని థేమ్స్ నదిలా మారుస్తామని చెప్పారని, ఇప్పటిదాకా చేయలేదన్నారు.

ఘట్కేసర్ ఎంపీపీ, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మూసీ పరిసరాల్లో 20 నుంచి 30 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. మూసీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక కన్వీనర్ పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. మూసీలోకి నగరంలోని ఇండ్ల వ్యర్థాలతో పాటు మెడికల్, రసాయన పరిశ్రమల వ్యర్థాలను కూడా యథేచ్ఛగా వదులుతుండటంతో తీవ్రంగా కలుషితమైందన్నారు. ప్రొఫెసర్ వెంకటదాసు మాట్లాడుతూ.. మూసీ నదిని, హైదరాబాద్ పరిసరాలలోని చెరువులను ప్రక్షాళన చేస్తేనే సిటీలో దోమలు, ఎయిర్ పొల్యూషన్ సమస్యలు తగ్గుతాయన్నారు.