BCCI: మా విధానం అదే.. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై మౌనం వీడిన బీసీసీఐ

BCCI: మా విధానం అదే.. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై మౌనం వీడిన బీసీసీఐ

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం షాకింగ్ గా మారింది. ముఖ్యంగా వీరిద్దరూ నెల వ్యవధిలో టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరికొన్నేళ్ల పాటు సుదీర్ఘ ఫార్మాట్ ఆడే సామర్ధ్యం ఉన్నప్పటికీ రోకో జోడీ ఫ్యాన్స్ ను బాధపెడుతూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. రోహిత్, కోహ్లీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ బలవంతం చేయడం కారణంగానే వీరిద్దరూ గుడ్ బై చెప్పారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు వీరి రిటైర్మెంట్ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చాడు. 

ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఫైన్‌తో పాటు WTC పాయింట్స్ కట్

రిటైర్మెంట్ నిర్ణయం ఆటగాడి సొంత నిర్ణయమని, క్రికెట్ సంఘంలో ఎవరూ ఎవరినీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోమని బలవంతం చేయలేరని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పుకార్లకు చెక్ పెట్టారు. "నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో మనమందరం బాధపడుతున్నాం. రిటైర్మెంట్ నిర్ణయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారంతటా వారే వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఏ ఆటగాడిని రిటైర్ అవ్వమని బీసీసీఐ ఎప్పుడూ చెప్పదు. రిటైర్మెంట్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే బీసీసీఐ విధానం. 

రోహిత్, కోహ్లీ స్వయంగా పదవీ విరమణ తీసుకున్నారు. మేము ఎల్లప్పుడూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఎప్పుడూ వారిని లెజెండరీ బ్యాటర్లుగా పరిగణిస్తాము. వారిద్దరూ వన్డేలకు అందుబాటులో ఉండటం మాకు చాలా మంచిది". అని శుక్లా అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో  రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ 67 టెస్టుల్లో 40.57 యావరేజ్ తో 4301 పరుగులతో టెస్ట్ కెరీర్ ను ముగించాడు. మరోవైపు కోహ్లీ 123 టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 9230 పరుగులు చేసి టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వీరిద్దరూ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.