బీఆర్ఎస్, బీజేపీని ఓడించాలె : ఆకునూరి మురళి

 బీఆర్ఎస్, బీజేపీని ఓడించాలె :  ఆకునూరి మురళి

పరిగి, వెలుగు: అసమర్థ, అబద్ధాల, అహంకార, మత విద్వేష, ఫాసిస్టు పాలన సాగిస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 23వ రోజున శనివారం పరిగి, మన్నెగూడలో కొనసాగింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వేల కోట్ల కుంభకోణాలతో సీఎం కేసీఆర్ కుటుంబం తన్నుకుపోయిందని ఆరోపించారు. 

కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట అడ్డూఆపూ లేని అవినీతి జరిగిందన్నారు. అవినీతి ఫలితంగానే ప్రాజెక్టు కుంగిందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం నాశనమయ్యాయని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, రైతులు కానివారికి రైతుబంధుతో జేబులు నింపుతున్నారని విమర్శించారు. చిన్న రైతులు, కూలీల బతుకులు అధ్వానంగా మారాయన్నారు. ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకమై కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపాలని కోరారు. 

కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు కూడా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపిందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోదీ విధానాలను కేసీర్ తొమ్మిదేండ్లుగా సమర్థిస్తూ వచ్చారన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్  లక్ష్మీనారయణ, ప్రొ. పద్మజా షా, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, పీడీఎస్ యూ రాష్ట అధ్యక్షుడు మహేశ్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, తదితరులు పాల్గొన్నారు.