ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు : ఆకునూరి మురళి

ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు : ఆకునూరి మురళి

హైదరాబాద్ : ఇండియాలో ఎప్పటి నుంచో అందరూ సమానంగా ఉండాలని, అందరూ సమానంగా ఉండొద్దనే రెండు భావజాలాలు ఉన్నాయని చెప్పారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. అందరూ సమానంగా ఉండొద్దనుకునే భావజాలం ఉన్న రాజకీయ నాయకులే సమాజాన్ని శాసిస్తున్నారని, విద్యావ్యవస్థను కూడా వాళ్లే శాసిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర తల్లుల సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జనసేన సమితి రాష్ట్ర అధ్యక్షులు. ప్రొఫెసర్ సుజాత సురేపల్లి, ఆకునూరి మురళి పాల్గొన్నారు. 

ఏ దేశంలో అయితే.. పిల్లల చదువు బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందో ఆ దేశం విద్యలో అన్ని సాధిస్తుందన్నారు ఆకునూరి మురళి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ పిల్లల చదువు బాధ్యతలను ఆయా ప్రభుత్వాలే తీసుకుంటున్నాయని చెప్పారు. పిల్లల చదువు బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకుంటే రాజకీయ నాయకులు కాలేజీలు, పాఠశాలలు నడిపించాల్సిన పరిస్థితులు ఉండవన్నారు. భారతదేశంలో అసమానత్వ భావజాలం ఉందని, ప్రభుత్వ పరిపాలన రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండడం వల్ల కావాలనే పిల్లల బాధ్యతను వారు తీసుకోవడం లేదన్నారు. సమస్య ఎక్కడ ఉందో సరిగ్గా ఆలోచన చేస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందన్నారు. 

తెలంగాణలో ఇప్పుడు ఏదైనా జరగాలంటే ముఖ్యమంత్రి స్విచ్ నొక్కితేనే జరుగుతుందన్నారు ఆకునూరి మురళి. రాష్ర్ట విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ అనుకుంటే అవుతుందని, కానీ, ముఖ్యమంత్రి అలా అనుకోవడం లేదన్నారు. కేసీఆర్.. అందరూ సమానంగా ఉండొద్దనుకునే వర్గానికి చెందిన వారు కాబట్టే రాష్ర్టంలో విద్యావ్యవస్థ తీరు ఇలా ఉందన్నారు. ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. దీన్ని బట్టే చూస్తే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.  

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు చదువుతున్న స్కూలు మాదిరిగా రాష్ర్టంలోని ప్రభుత్వ స్కూళ్లు ఉండకూడదా..? అని ప్రశ్నించారు. హిమాన్షు చదువుతున్న స్కూలు తరహాలో ప్రతి మండలానికి ఐదు పాఠశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిది ఏళ్ల పాలనలో 17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని , అందులో 50 వేల కోట్లు ఖర్చు పెడితే హిమాన్షు చదువుతున్న స్కూళ్లు ఎన్నో ఏర్పాటు అయ్యేవని అన్నారు.
ఐదేళ్లకు 70 వేల కోట్ల రూపాయల ఖర్చుపెట్టగలిగితే కాలేజీలు, యూనివర్శిటీలు (విద్యావ్యవస్థ మొత్తం) ఎంతో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. విద్యకు రాష్ర్ట ప్రభుత్వం 6.4 శాతమే బడ్జెట్ కేటాయిస్తోందని, దీన్ని 13శాతం పెంచామని అడుగుతున్నామని చెప్పారు. పక్కా రాష్ర్టాలు విద్యకు అధిక శాతం నిధులు కేటాయిస్తున్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై తరచూ సమీక్ష చేస్తున్న సీఎం కేసీఆర్...విద్యా వ్యవస్థపై ఎందుకు సమీక్షించడం లేదని ఆకునూరి మురళి ప్రశ్నించారు. తరచూ మానిటరింగ్ చేసి, నిధులు ఇస్తే టీచర్లు, ప్రొఫెసర్లు విద్యార్థులకు బాగా చదువులు చెప్పగలుగుతారని అన్నారు. అధికారులు కూడా అడిగితే బాగా పని చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఇది రాజకీయం అంశం కాబట్టి.. రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావ్యవస్థపై, రాజకీయ వ్యవస్థపై పోరాడుదామని, మంచి సొసైటీని నిర్మించుకుందామంటూ పిలుపునిచ్చారు.