సొంత జాగాలో ఇల్లు కట్టుకునే స్కీంపై ఆకునూరి మురళి విమర్శ

సొంత జాగాలో ఇల్లు కట్టుకునే స్కీంపై ఆకునూరి మురళి విమర్శ

హైదరాబాద్, వెలుగు:  సొంత జాగాలో డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు కనీసం 10 శాతం మందికి కూడా కేసీఆర్​ డబ్బులు ఇవ్వరని రిటైర్డ్​ ఐఏఎస్​ ఆకునూరి మురళి అన్నారు. ‘‘డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి ఈ ఏడాదికిగానూ 4 లక్షల మందికి రూ.7,350 కోట్లను ఇస్తాడట. రాసిపెట్టుకోండి.. అందులో 10 శాతం మందికి కూడా కేసీఆర్​ పైసలు ఇవ్వడు. ఆరేండ్ల కిందట ఒక్క ఇంటికి రూ.5 లక్షలు ఇస్తానన్నడు. ఇప్పుడేమో రూ.3 లక్షలు చేసిండు. ఆరేండ్ల సంది లక్ష మందికి కూడా ఇండ్లివ్వలేదు. ఇంత పేదల వ్యతిరేకి, అబద్ధాల సీఎం, అవినీతి ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చూడలేదు’’అని ఆయన గురువారం ట్వీట్​ చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగంలో మన ర్యాంక్​ కింది నుంచి ఏడోదా? అని నిలదీశారు. పెద్ద రాష్ట్రాల పరంగా అయితే మన రాష్ట్రమే చివరి స్థానంలో ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గుపడాలని ఫైర్​ అయ్యారు. మన ఊరు– మన బడి కోసం రూ.7,268 కోట్లు ఇస్తున్నామని చెప్పినా.. రూ.300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.