Honey Glimpse: నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్ రిలీజ్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్!

Honey Glimpse: నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్ రిలీజ్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్!

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. గతేడాది వరుస విజయాలతో అలరించిన ఆయన, కన్నడ ఇండస్ట్రీలోనూ కిచ్చా సుదీప్ 'మార్క్'  సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు నవీన్ చంద్ర.  ఈ నేపథ్యంలో 2026 నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ 'హనీ' గ్లింప్స్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా..

కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమాజంలోని చీకటి కోణాలను ఆవిష్కరించబోతోంది. కేవలం హారర్ మాత్రమే కాకుండా, ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించడం విశేషం. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. నవీన్ చంద్ర తనదైన శైలిలో సీరియస్ రోల్‌లో కనిపిస్తుండగా, దివ్య పిళ్లై కథానాయికగా నటిస్తోంది.

వెన్నులో వణుకు పుట్టించే గ్లింప్స్

న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భయంకరమైన నేపథ్య సంగీతం (BGM), గగుర్పాటు కలిగించే విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అజయ్ అరసాడ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

తారాగణం 

ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.  యదార్థ ఘటనలతో కూడిన హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు 'హనీ' ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరిలో నవీన్ చంద్ర మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారో లేదో వేచి చూడాలి!