గెలిచినోళ్లను కాపాడుకునేందుకు 15 టీమ్స్ అవసరం : ఆకునూరి మురళి

గెలిచినోళ్లను కాపాడుకునేందుకు 15 టీమ్స్ అవసరం : ఆకునూరి మురళి

ఖైరతాబాద్, వెలుగు : గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కట్టడికి జిల్లాకు 100  మంది చొప్పున కనీసం 15టీమ్స్ ఏర్పాటు చేయాలని మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి సూచించారు. బీఆర్ఎస్​కు సీట్లు తక్కువ వస్తే కేసీఆర్ ఇతర పార్టీల నేతలను కొంటాడని ప్రచారం జరుగుతున్నట్లు  తెలిపారు. కేసీఆర్ దుర్మార్గపు బుద్ధిని​అధిగమించి కాంగ్రెస్​తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కోరారు. 'ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేద్దాం?'  అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  సీనియర్​ జర్నలిస్టు సతీష్​ కమాల్​అధ్యక్షతన రౌండ్​టేబుల్​ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీనియర్​ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్​ చర్యలు తీసుకోరని, గవర్నర్​ పట్టించుకోరని అన్నారు. ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. చట్టాలు అందరికీ సమానమేనని, అయితే ఆ చట్టాలు కొందరికి చుట్టమయ్యాయని వెల్లడించారు. సీనియర్​పాత్రికేయులు కె. శ్రీనివాస్​ మాట్లాడుతూ..గత 10ఏండ్లల్లో అధికార పార్టీలోకి 45 మంది ఎమ్మెల్యేలు మారారని చెప్పారు.

వారు మారింది నియోజక వర్గ అభివృద్ధి కోసం కాదని స్వలాభం కోసమేనని వివరించారు. సమావేశంలో సీపీఎం నేత నర్సింహరావు,  దాసరి శ్రీనువాసు,  తెలంగాణ విఠల్​, పృథ్వీరాజ్​ యాదవ్, సొగరా బేగం, మహిపాల్​యాదవ్​,  బీఎస్పీ నాయకుడు విజయ్​ యాదవ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతలు తదితరులు పాల్గొన్నారు.