మన ఊరు–మన బడి పచ్చి మోసం

మన ఊరు–మన బడి పచ్చి మోసం
  • అది డబుల్ ఇండ్ల పథకం లాంటిదే: ఆకునూరి మురళి 
  • విద్యారంగంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం
  • స్కూళ్లు, హాస్టళ్లలో దారుణ పరిస్థితులున్నయ్.. తనిఖీలకు వెళ్తే క్షణం ఉండలేకపోతున్నమని వెల్లడి 
  • కేసీఆర్.. విద్యా వ్యవస్థను ఆగం చేసిన్రు: దాసోజు శ్రవణ్
  • రౌండ్​ టేబుల్​ సమావేశంలో నేతల ధ్వజం

ఖైరతాబాద్, వెలుగు: విద్యారంగంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. విద్యారంగానికి 20 శాతం బడ్జెట్​ కేటాయించాలని కొఠారి కమిషన్ చెబితే.. కేసీఆర్ మాత్రం కేవలం 6 శాతం నిధులే కేటాయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో విద్యా సంస్థలు, హాస్టళ్లు సౌలతుల్లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సోషల్ డెమోక్రటిక్ ​ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్​టేబుల్​ సమావేశంలో మురళి పాల్గొని మాట్లాడారు. బడుల్లో సౌలతులు కల్పించేందుకు ఎనిమిదేండ్లలో కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. స్కూళ్లు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. తనిఖీలకు వెళ్తే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మన ఊరు – మన బడి కార్యక్రమం పచ్చి మోసం. అది కూడా డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల పథకం లాంటిదే. ప్రజలను మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్​కు ఎంతో నైపుణ్యం ఉంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే వారిపై కేసీఆర్ రాజకీయ ముద్ర వేస్తున్నారు” అని అన్నారు. ‘‘కేసీఆర్ పై​నాకేం కోపం లేదు. పేదలను మోసం చేస్తున్నారనే బాధ మాత్రమే ఉంది. ఆయన వల్ల పేద పిల్లలు ఏమైపోతారోననే బెంగ ఉంది” అని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఫుల్ టైమ్ వీసీని నియమించాలని, ప్రతి విద్యార్థికి ల్యాప్​టాప్ ఇవ్వాలని, 30 మంది విద్యార్థులకొక టీచర్​ను నియమించాలని డిమాండ్ చేశారు. 
 

పేరెంట్స్ ను అవమానిస్తున్నరు: రాజేశ్వరి 
తమ పిల్లల భవిష్యత్ కోసం కొట్లాడితే అరెస్టు చేస్తున్నారని, తాము ఏమైనా టెర్రరిస్టులమా? అని బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ లో సెక్యూరిటీ వాళ్లు కూడా పేరెంట్స్ ని అవమానిస్తూ మాట్లాడుతున్నారని వాపోయారు. ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘‘క్యాంపస్ లో సమస్యలే లేవని మంత్రి సబిత చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆమె క్యాంపస్ కి వచ్చిపోయినంక కూడా ఫుడ్ పాయిజన్ జరిగినా, కనీసం నోరు మెదపలేదు. విద్యార్థుల గోడు గవర్నర్ అర్థం చేసుకున్నారు. టైమ్ ఇచ్చి సమస్యలు విన్నారు. కానీ సీఎం కేసీఆర్ కు మాత్రం విద్యార్థుల బాధ అర్థమవడం లేదు” అని అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా క్యాంపస్ లో చదువుతున్నారని, వాళ్లు కూడా నోరు విప్పాలని కోరారు. క్యాంపస్ ను మూసేయాలని ప్రభుత్వం చూస్తోందని పేరెంట్స్ కమిటీ జనరల్ సెక్రటరీ స్రవంతి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని సోషల్ డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్ వెంకట్ రెడ్డి అన్నారు.  
 

విద్యార్థుల సమస్యలపై ఉద్యమం జరగాలె: దాసోజు 
ఇంతకుముందు ఎప్పుడైనా తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులే పోరాడేవారని, కానీ దేశంలో మొదటిసారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం రోడ్లకు మీదకు వచ్చి కొట్లాడుతున్నారని.. అలాంటి దుస్థితి కేసీఆర్ కల్పించారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలపై తాను 2013లోనే రిప్రజెంటేషన్ ఇచ్చానని, కానీ స్వరాష్ట్రంలోనూ ఆ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు విద్యను అప్పగించిన కేసీఆర్.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆగం చేశారని మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీలో చదువుతున్న 8వేల మంది విద్యార్థుల భవిష్యత్తును టీఆర్ఎస్ సర్కార్​ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందన్నారు.