అల్‌-ఖాదిర్ ట్ర‌స్టు కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు 2 వారాల బెయిల్‌

అల్‌-ఖాదిర్ ట్ర‌స్టు కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు 2 వారాల బెయిల్‌

అల్ ఖాదిర్ ట్ర‌స్టు కేసులో అరెస్టుయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయ‌న‌కు తాత్కాలిక‌ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ అరెస్టు చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌ని ఇటీవలే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించగా.. ఒక్క రోజు తేడాలోనే ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరీ చేయడం గమనార్హం. జ‌స్టిస్ మియాంగుల్ హ‌స‌న్ ఔరంగ‌జేబ్‌, జ‌స్టిస్ సమాన్ రాఫ‌త్ ఇంతియాజ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇమ్రాన్‌కు బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్‌పై ఉన్న అన్ని కేసుల్ని ఒకేద‌గ్గ‌రికి మార్చాల‌ని కోరుతూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టును కోరారు. కోర్టు రూమ్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు నేప‌థ్యంలో విచార‌ణ రెండు గంట‌లు ఆల‌స్యంగా సాగినట్టు తెలుస్తోంది.

అంతకుముందు ఇమ్రాన్‌ ఖాన్‌‌కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ ఊరట ఇచ్చింది. ఆయన అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణంలోకి ప్రవేశించి అరెస్టు చేయడం పూర్తిగా కోర్టు ధిక్కారమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ మహమ్మద్‌ అలీ మజార్‌, జస్టిస్‌ అథర్‌ మినాల్లాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు భూముల కేటాయింపులు విషయంలో ఇమ్రాన్ ఖాన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన్ను బలవంతంగా అరెస్టు చేశారని సుప్రీం పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తక్షణమే మాజీ ప్రధానిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు, ఇమ్రాన్ ఆరెస్ట్ తీరును కూడా తప్పుబట్టింది. ఓ వ్యక్తికి కోర్టు హాజరైతే లొంగిపోయినట్టేనని, పోలీసులు అరెస్ట్ చేసేది ఏముందని నిలదీసింది. 90 మంది న్యాయస్థానం ప్రాంగణంలోకి ప్రవేశిస్తే కోర్టు మర్యాద ఏమవుతుందని త్రిసభ్య ధర్మాసనం మండిపడింది.