కేటీఆర్​ దగ్గరికి ఆలేరు పంచాయితీ

V6 Velugu Posted on Sep 21, 2021

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా, ఆలేరు నియోజకవర్గ టీఆర్​ఎస్​ పంచాయితీ చివరికి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దగ్గరకు చేరింది.  తుర్కపల్లి మండలానికి చెందిన మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ పడాల శ్రీనివాస్​ సస్పెన్షన్​ ఎత్తివేత​పై కేటీఆరే నిర్ణయం తీసుకుంటారని మంత్రి జగదీశ్​రెడ్డి తేల్చిచెప్పారు. ఇటీవల తుర్కపల్లి మండల టీఆర్​ఎస్​ కమిటీ ఎన్నిక సందర్భంగా డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.. మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ పడాల శ్రీనివాస్​ సహా ఐదుగురిని సస్పెండ్​ చేశారు. ఈ వివాదం పార్టీలో కలకలం సృష్టించింది. తన సస్పెన్షన్​ను సవాల్​ చేస్తూ పడాల శ్రీనివాస్​ సోమవారం భారీ సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కేడర్​ను హైదరాబాద్​లోని మినిస్టర్​ క్వార్టర్​కు తరలించారు. మంత్రి జగదీశ్​రెడ్డిని కలిసి  పార్టీతో  సంబంధాలు లేని వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో కార్యకర్తలు కొంత ఆవేశపడ్డారని, గొడవతో  ఎలాంటి సంబంధం లేని తనను అన్యాయంగా సస్పెండ్​ చేశారని పడాల శ్రీనివాస్​ మంత్రికి వివరించారు.  ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని,  కేటీఆర్​ఈ ఘటనపై అసంతృప్తిగా ఉన్నారని మంత్రి ఆయనకు చెప్పారు. కేటీఆర్​ నిర్ణయం తీసుకునేదాక సైలెంట్​గా ఉండాలని  సూచించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు, ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి వేర్వేరుగా  మంత్రిని కలిసి సస్పెన్షన్​ వ్యవహారంపై వివరించినట్టు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే సస్పెండ్​ చేయాల్సి వచ్చిందని వివరించారని సమాచారం. సస్పెన్షన్​ ఎత్తి వేయకుంటే కేసీఆర్​ ఫాంహౌజ్​కు వెళ్లి తేల్చుకుంటామని పడాల శ్రీనివాస్​ వర్గం తేల్చిచెప్తోంది. 

Tagged TRS, KTR, , Alair constituency, Gongidi Suntiha

Latest Videos

Subscribe Now

More News