అలంపూర్, వెలుగు : స్థానికులపై పై హైవే పనుల కోసం వచ్చిన బిహార్ కూలీలు దాడి చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున మానవపాడులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరవాయికి చెందిన డేవిడ్, అనిల్, బోరవెల్లికి చెందిన గోపాల్‌తో కలిసి ఇటిక్యాల మండలం సాసనల్ గ్రామంలో శనివారం ఓ వివాహానికి హాజరై తిరిగి బైక్‌పై ఆదివారం తెల్లవారుజామున వస్తున్నారు.
ఈ క్రమంలో మానవపాడు సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర హైవే పనులు చేసే బిహార్ కూలీలు వారిని అడ్డగించారు. డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తుండగా డేవిడ్, అనిల్ అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డారు. కానీ, దివ్యాంగుడైన గోపాల్ వాళ్లకు చిక్కిపోయాడు. దీంతో అతడిపై రాళ్లతో, రాడ్లతో దాడి చేసి అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్, నగదును లాక్కొని పారిపోయారు. గాయపడిన గోపాల్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం సాయంత్రం వారు మానవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై స్వాతి తెలిపారు.
