
- నేడు వింబుల్డన్ మెన్స్ ఫైనల్
- రా. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
లండన్: మెన్స్ సింగిల్స్ టెన్నిస్‌లో మరో గ్రేటెస్ట్ ఫైనల్‌కు సమయం వచ్చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫైట్‌లో కొదమసింహాల్లా కొట్లాడి రికార్డు సృష్టించిన వరల్డ్ నంబర్ 1,2 ప్లేయర్లు యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ ఆదివారం రాత్రి జరిగే వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ కోసం తలపడిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో వింబుల్డన్ టైటిల్ కోసం పోటీ పడుతున్న ప్లేయర్లు సినర్, అల్కరాజ్ కావడం విశేషం. 2006-–2008 మధ్య ఫెడెక్స్, నడాల్ వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ ఫైనల్లో తలపడ్డారు. గత నెల రోలాండ్ గారోస్‌లో ఐదున్నర గంటల ఫైనల్లో సినర్‌ను ఓడించిన కార్లోస్ టైటిల్ నెగ్గాడు. అదే జోరును గ్రాస్ కోర్టులోనూ కొనసాగించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సినర్ కసితో ఉన్నాడు. ప్రస్తుతం మెన్స్ టెన్నిస్ సర్క్యూట్‌లో సినర్, అల్కారాజ్ వైరం అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గత ఆరు మేజర్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆదివారం ఆ నంబర్ ఏడుకు పెరుగుతుంది. గత 12 స్లామ్‌లలో తొమ్మిది వీళ్లే గెలుచుకోవడం గమనార్హం.
ఇద్దరూ.. ఇద్దరే
రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన అల్కరాజ్ ప్రస్తుతం 24 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 25వ విజయంతో వింబుల్డన్‌లో వరుసగా మూడో టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు సినర్ వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి వచ్చాడు. వీటిలో యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో కార్లోస్ చేతిలో కంగుతిన్నాడు. ఆ ఫైనల్లో అల్కరాజ్ తొలి రెండు సెట్లు కోల్పోయినా అద్భుతంగా పుంజుకోవడంతో పాటు మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని గెలిచి ఔరా అనిపించాడు.
5 గంటల 29 నిమిషాల పోరాటం మెన్స్ టెన్నిస్‌చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు వింబుల్డన్ తుదిపోరులో ఈ ఇద్దరి ఆఖరాట కూడా సుదీర్ఘంగా, హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది. సినర్ తన హైట్‌ను సద్వినియోగం చేసుకొని పవర్‌ఫుల్ గ్రౌండ్ స్ట్రోక్‌లు, రిటర్న్‌లతో పాటు అత్యంత ప్రమాదకరమైన సర్వ్‌తో తన ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇంకోవైపు అల్కరాజ్ వెరైటీ షాట్లు ఆడటంలో మాస్టర్. ఫుల్ స్పీడ్‌తో పాటు బేస్‌లైన్ నుంచి షాట్లు కొట్టగలడు. రెప్పపాటులో నెట్ వద్దకు దూసుకెళ్తాడు. అనూహ్యమైన డ్రాప్ షాట్లతో అవతలి ఆటగాడిని ఏమారుస్తాడు.