మద్యం ముట్టని ఊరు

మద్యం ముట్టని ఊరు

బర్త్​డే, బ్యాచిలర్స్ పార్టీ నుంచి మ్యారేజ్​డే  వరకు అన్ని పార్టీలకు ఆల్కహాల్ ఉండాల్సిందే. అంతేనా, జాబ్​ వచ్చిందని, వీకెండ్, మంత్​ ఎండ్, ఇయర్ ఎండ్​ అని, కారణం ఏదైనా ఫ్రెండ్స్​తో చిల్ అవ్వాలంటే బీర్​ పొంగాల్సిందే. లవ్​ ఫెయిల్యూర్​, ఫ్యామిలీ గొడవలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు వీటికీ కూడా ఒకటే మందు. వెజిటేరియన్, నాన్​ వెజిటేరియన్, పల్లెటూరు, సిటీ ఏదైనా.. ఎక్కడైనా.. ఎవరైనా.. ఈ ఒక్క విషయంలో మాత్రం అంతా ఒకటే. కానీ, ఈ ఊళ్లో అలా కాదు. ఊళ్లో ఏ ఒక్కరూ మద్యం ముట్టరు! 

అది బీహార్​లోని జముయ్ జిల్లాలో గిధౌర్​ అనే బ్లాక్​లో ఉన్న గంగారా విలేజ్​. ఈ ఊళ్లో మొత్తం నాలుగు వందల ఇండ్లున్నాయి. అందులో 3, 500 జనాభా ఉంటారు. వాళ్లు ఆరాధించే దేవుడికి ఇష్టం లేని పని తాము చేయకూడదని కంకణం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచారాలను పాటిస్తున్నారు. ప్రతి ఊళ్లోనూ కొన్ని ఆచారాలు ఉంటాయి. కాకపోతే వాటిని ఊరంతా పాటించకపోవచ్చు. కొన్ని ఆచారాలు పాటించగలిగితే చేస్తారు. లేదంటే దాటేస్తారు. వాటిలో ముఖ్యంగా పేకాట, సిగరెట్, మందు తాగడం లాంటివి. చాలాకొద్ది మంది మాత్రమే నిష్ఠగా ఉంటారు. కానీ, ఈ ఊళ్లో మాత్రం అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వాళ్లంతా మందు తాగడం మానేశారు. లిక్కర్​ బ్యాన్​ చేయాలని కొంతకాలంగా బీహార్​ గవర్నమెంట్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఈ ఊళ్లో మాత్రం వందల ఏండ్ల కిందటే లిక్కర్​ బ్యాన్ అయిపోయింది. అది గవర్నమెంట్​కి భయపడో, పోలీస్​లు కొడతారనో కాదు. మద్యం తాగడం వల్ల ఆడవాళ్ల మీద హింస పెరిగిపోతుందని. ఈ విషయంపై గతంలో బీహార్​లోని కొన్ని ఊళ్లలో ఆడవాళ్లు వైన్​ షాపులు కూలగొట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దానికి ఫలితంగా చాలా ఊళ్లు మారాయి కూడా. మద్యం తయారుచేయడం, అమ్మడం ద్వారా బతికేవారు గిరిజన ప్రజలు. కానీ, గవర్నమెంట్​ సాయంతో ఇప్పుడు ఆవులు, గేదెలు పెంచుతూ, పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఈ ఊళ్లో ఉండేవాళ్లు ఎలాగూ తాగరు. అంతేకాకుండా తాగిన తర్వాత ఆ ఊళ్లో అడుగుపెట్టకూడదు. అలాగే పెండ్లి ఫిక్స్​ అయ్యాక, ఊరేగింపుకు ముందు వరకు తాగకూడదు. వేరే ఊళ్ల నుంచి వచ్చేవాళ్లు ఈ రూల్స్​ కచ్చితంగా పాటించాల్సిందే. ఇంత స్ట్రిక్ట్​గా పాటిస్తారు కాబట్టే ఇప్పటి వరకు గిధౌర్ పోలీస్​ స్టేషన్​లో మద్యం గురించి ఒక్క కేసు కూడా ఫైల్​ కాలేదు అంటారు అక్కడ పోలీస్​లు. 

బాబా తెచ్చిన మార్పు 
ఆ ఊళ్లో మద్యం తాగడం కాదు కదా! వాసన కూడా రాదు.  అయితే ఇది నిన్న, మొన్న పుట్టిన ఆచారం కాదు. వాళ్లు అంత నిష్ఠగా ఉండటానికి గల కారణం ఎవరు? అంటే... బాబా కోకిల్ చంద్​. గంగారా ఊరివాళ్లు కోకిల్​చంద్​ అనే బాబాను ఆరాధిస్తారు. పూర్వకాలం నాటి బాబా మట్టి ప్రతిమ ఆ ఊళ్లో కనిపించింది. దాంతో ఆయనకు గుడి కట్టారు. ఆ గుడిలో ప్రతి రోజూ పూజలు చేస్తారు. ఈ రోజు వరకు ఆయన అక్కడే ఉన్నాడని, ఆయనే లిక్కర్​ని ఎవరికి వాళ్లు మానేసేలా చేశాడని నమ్ముతారు. వాళ్లలో ఏ ఒక్కరు మందు​ తాగినా, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్​ అందరూ చనిపోతారనే నమ్మకం ఉంది. అందుకే లిక్కర్​ తాగడానికి భయపడతారు. అంతేకాదు, మత్తు పదార్థాలన్నింటికీ దూరంగా ఉంటారు.  ఇక్కడ పార్టీలు, ఈవెంట్​లలో కూడా మద్యం కనిపించదు. ఒకవేళ ఎవరైనా తాగుతున్నట్టు కనిపిస్తే, ఇకపై వాళ్లు ఊళ్లోకి రాకూడదని చెప్తారు. అయితే, ఎన్నో ఏండ్ల కిందట చాలామంది ‘‘ఈ ఆచారం ఒక మూఢనమ్మకం. దీన్ని ఆపేయాలి’’ అనుకున్నారు. అప్పటి నుంచి అలా అనుకున్న వాళ్ల ఫ్యామిలీల్లో ఏదో ఒక నష్టం జరిగేది. దాంతో మద్యం తాగడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు బాగా భయపడిపోయారు. అప్పటి నుంచి పూర్తిగా మద్యం మానేశారు. ఆ ఊళ్లో ఉన్నప్పుడే కాదు, ఆ ఊరి వాళ్లు చదువు, ఉద్యోగాల కోసం వేరే ఊళ్లలో లేదా విదేశాల్లో ఉన్నా సరే, అక్కడ కూడా ఆల్కహాల్ తాగరు. 
మొత్తం మూడు సూత్రాలు చెప్పాడు బాబా. మద్యానికి దూరంగా ఉండటం, ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం, తినే తిండిని వేస్ట్ చేయకపోవడం మంచిది. ఈ మూడు కచ్చితంగా పాటించాలని చెప్పేవారని చెప్తారు అక్కడి వాళ్లు. ఆ ఊళ్లో ‘బాబా కోలిక్​చంద్ థాట్ ఫోరమ్’ పేరుతో ఒక కమిటీ కూడా ఉంది.