సీఎం రేవంత్‌‌పై ఈటల..అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

సీఎం రేవంత్‌‌పై ఈటల..అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
  • కేసీఆర్​ రుణమాఫీ చేయనప్పుడు ఎందుకు మాట్లాడలే : బీర్ల ఐలయ్య 

హైదరాబాద్, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మల్కాజ్‌‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. ఉద్యకారుడినని, బీసీల ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న ఈటల.. అదే బీసీలు తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈటల ఎందుకు మాట్లడలేదని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందరోజుల్లో  90శాతం అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఐలయ్య స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చరిత్ర కాంగ్రెస్‌‌కు లేదని, బీజేపీకి, బీఆర్ఎస్‌‌కు ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ ట్యాపింగ్ చేసి బీజేపీ ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్​ చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

సీఐ స్థాయి అధికారికి డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చి బీఆర్ఎస్  ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా? అని ఆయన నిలదీశారు. మల్కాజ్‌‌గిరి ఎంపీగా గెలిచేందుకు కేసీఆర్‌‌ను పొగడడం కరెక్ట్​ కాదన్నారు. సీఎం రేవంత్.. గత ప్రభుత్వ పథకాలతో పాటు తమ సర్కారు కొత్తగా తెచ్చిన స్కీములను విజయవంతంగా అమలు చేస్తుంటే ఓర్వలేక చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఈటల అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, -బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని, లోక్‌‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలను చిత్తుగా ఓడిస్తారన్నారు. ఇప్పటికైనా ఈటల చౌకబారు ఆరోపణలను మానుకోవాలని ఐలయ్య హితవు పలికారు.

ఒక్క గేటు తెరిస్తేనే బీజేపీ, కాంగ్రెస్​ అతలాకుతలం అయితున్నయ్

దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించనంతగా మాజీ సీఎం కేసీఆర్ ​సంపాదించాడని, ఆ డబ్బు మదంతోనే కాంగ్రెస్ సర్కారును కూల్చుతామని మాట్లాడుతున్నారని ఐలయ్య మండిపడ్డారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వంద రోజులు ఓపిక పట్టారని, ఆ తర్వాత ఒక్క గేటు తెరవగానే బీజేపీ, బీఆర్​ఎస్ ​నేతలు అతలాకుతలం అవుతున్నారని అన్నారు. ఇంకో నాలుగైదు గేట్లు తెరిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి అభ్యర్థులు కూడా దొరకరని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్​రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ఆ ప్రభుత్వ పాలన నచ్చి ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.