
చీరల దొంగల ముఠాలు ఇటీవల కాలంలో తమ చేతివాటన్నీ ప్రదర్శిస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడిన మహిళలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో దొంగతనాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. వేల, లక్షల ఖరీదైన చీరలను క్షణాల్లో మాయం చేస్తున్నారు. తాజాగా.. బెంగళూరులో ఓ దొంగల ముఠా చీరల చోరీకి పాల్పడగా... షాపు యాజమాన్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరు జేపీ నగర్ ప్రాంతంలో ఓ బట్టల షాపులోకి ఓ దొంగల ముఠా కస్టమర్ల మాదిరిగా షాపులోకి ప్రవేశించింది. విలువైన పట్టు చీరల కొనుగోలు చేసేందుకు వచ్చామని షాపు వారిని నమ్మించి... చీరలను పక్కదోవపట్టించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన షాపు యజమాని.. నేరగాళ్లను పసిగట్టి... పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను ( మహిళలను) అదుపులోకి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీస్ స్టైల్లో విచారించారు. దీంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ. 17.5 లక్షల విలువైన 38 పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఇలానే జయనగర్ లో మరో దుకాణంలో ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా బట్టల షాపులో చీరలను దొంగిలించేందుకు ప్రయత్నం చేయగా ముఠాలోని ఇద్దరు సభ్యులు పారిపోయారని .. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ B దయానంద తెలిపారు. ఈ నలుగురు మహిళలు మరో ఇద్దరితో కలిసి జేపీ నగర్‌లోని ఓ సిల్క్ షాప్‌కి వెళ్లి షాపులో ఉన్న కార్మికుల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు.ఈ కేసులో నలుగురు నిందితులైన మహిళలను అరెస్టు చేశామని, మరో ఇద్దరిని త్వరలో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.