అలైన్మెంట్ పూర్తి చేసుకున్న కేసీఆర్ మార్గ్

అలైన్మెంట్ పూర్తి చేసుకున్న కేసీఆర్ మార్గ్
  •     మార్కింగ్ పూర్తి చేసిన ఆర్​అండ్​బీ ఆఫీసర్లు
  •     భూములు, ఇండ్లు కోల్పోతామని ఆందోళన
  •     ఎమ్మెల్యేకు అప్పనపల్లి వాసుల వినతి

సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి సాగు నీటి ప్రాజెక్టుల భూసేకరణ తతంగం ముగిసిందో లేదో ఇప్పుడు సిద్దిపేట రింగ్ రోడ్డు పేరిట స్థానికులకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ దాదాపు 88 కిలోమీటర్ల మేర 160 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారం ఇప్పుడు పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.  దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని చుడుతూ మూడు నియోజకవర్గాల పరిధిలోని 6 మండలాల గుండా రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అధికారులు అలైన్మెంట్​మార్కింగ్ పూర్తి చేసి డీపీఆర్ రెడీ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటివరకు అధికారికంగా భూ సేకరణ మాటెత్తని ఆఫీసర్లు పాత రోడ్డు నుంచి దీన్ని నిర్మిస్తామని చెబుతుండటం గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని బీటీ డబుల్​రోడ్డుతో నిర్మిస్తామని చెబుతున్నా భవిష్యత్తులో విస్తరణ పేరిట భూసేకరణ జరిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 86 కిలో మీటర్ల మేర రింగ్ రోడ్డును నిర్మిస్తుండగా  క్రాసింగ్స్​వద్ద మాత్రమే అవసరమైతే భూసేకరణ జరుపుతామని పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే పలు గ్రామాల్లో మార్కింగ్​చేయడంతో రింగ్ రోడ్డు పేరిట తమ భూములకు ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దుబ్బాక మండలం అప్పనపల్లిలో అలైన్మెంట్ మార్కింగ్​చేయడంతో 54 ఇండ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రోడ్డు పైనుంచే రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుండటంతో రెండు వైపులా అవసరమైనంత మేర భూమిని సేకరించే అవకాశాలున్నాయి. దీంతో రెండు రోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కలసి గోడు వినిపించారు. వారికి అండగా ఉంటానని రింగ్ రోడ్డు అప్పనపల్లి గ్రామం బయట నుంచి వెళ్లేవిధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో మల్లన్న సాగర్ కాల్వల కోసం అప్పనపల్లి గ్రామంలో సేకరించిన భూములకు కేవలం రూ. 5.9 లక్షల పరిహారం ఇవ్వగా పక్కనే ఉన్న తోర్నాల గ్రామంలో భూములకు రూ. 13 లక్షల చొప్పున ఇచ్చి తమకు అన్యాయం చేసిన  విషయాన్ని  గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. గతంలో మల్లన్నసాగర్ కాల్వల్లో భూములు కోల్పోయినవారు కొందరు మళ్లీ   రింగ్ రోడ్డు నిర్మాణంతో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

కేసీఆర్ మార్గ్ గా నామకరణం
సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ ఐదు నియోజకవర్గాల ప్రజల కోసం కొత్తగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డుకు కేసీఆర్ మార్గ్ గా పేరు పెట్టారు. ఈ రింగ్ రోడ్డు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మొత్తం ఆరు మండలాల గుండా 88 కిలో మీటర్ల మేర  నిర్మించనున్నారు.  ప్రస్తుతానికి   డబుల్ బీటీ రోడ్డు గా ఏర్పాటు చేసి భవిష్యత్తులో విస్తరించే అవకాశాలున్నాయి. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల హుస్నాబాద్ నియోజవర్గ ప్రజలకు 15 నుంచి 20 కిలో మీటర్ల మేర హైదరాబాద్ ప్రయాణం తగ్గనుంది. వెహికల్స్​ సిద్దిపేట పట్టణంలోకి రానవసరం లేకుండానే  కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ వెళ్లేలా రింగ్ రోడ్డు నిర్మించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.


అప్పనపల్లి వాసులను నష్టపోనివ్వ
సిద్దిపేట రింగు రోడ్డు కోసం అప్పనపల్లి  గ్రామంలో 54 ఆవాసాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ విషయంలో అవసరమైతే  బాధితుల పక్షాన ప్రత్యక్ష ఆందోళనకు దిగుతా. ఒక్క ఇల్లు కూడా  పోనివ్వకుండా అడ్డుకుంటా. మల్లన్నసాగర్ కాల్వ పేరిట అప్పనపల్లివాసులు ఇప్పటికే   వందల ఎకరాలు పోగొట్టుకుని తక్కువ పరిహారాన్ని పొందారు. మళ్లీ అప్పనపల్లి వాసులకు నష్టం చేయడానికి  రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నందున రింగు రోడ్డును దుబ్బాక నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వను. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రింగు రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు.  
– ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక

అలైన్మెంట్ ప్రక్రియ పూర్తి
సిద్దిపేట కొత్త రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్​ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు  సెంటర్ మార్కింగ్ చేసి పది మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నాం. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా భూసేకరణ చేయడం లేదు. క్రాసింగ్స్​వద్ద  బ్లాక్ స్పాట్ లను డిలీట్ చేయడం కోసం అవసరమైన మేర మాత్రమే భూమిని సేకరించాలని ప్లాన్ చేస్తున్నాం. పూర్తి డీపీఆర్ ఇంకా రానందున అప్పనపల్లి వద్ద పూర్తి స్థాయిలో మార్కింగ్ చేయలేదు. అక్కడ ఇండ్లకు ఎలాంటి సమస్య ఏర్పడదు– వెంకటేశం, ఆర్ అండ్​బీ డీఈఈ, సిద్దిపేట