గుజరాత్‌‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్..

గుజరాత్‌‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్..

గాంధీనగర్: గుజరాత్‌‌లోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన పూర్తయింది. విజయ్ రూపానీ రాజీనామాతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన కొత్త సీఎం భూపేంద్ర పటేల్ అధ్యక్షతన నూతన కేబినెట్ కొలువుదీరింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎంతోపాటు కేబినెట్‌ మొత్తాన్ని సమూలంగా మార్చారు. నో రిపీట్ ఫార్ములాకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు.. పాత కేబినెట్‌లోని ఏ ఒక్క మంత్రిని కూడా కొత్త కేబినెట్‌లోకి తీసుకోలేదు.  

కొత్త మంత్రులు వీళ్లే..

పది మంది మంత్రులు, 14 మంది సహాయ మంత్రులతోపాటు మరో ఐదుగురు స్వతంత్ర మంత్రులతో ఏర్పడిన నూతన కేబినెట్‌తో గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రుల విషయానికొస్తే.. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేది మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనతోపాటు జీతూ వఘానీ, రుషికేష్ పటేల్, పూర్ణేశ్ మోడీ, రాఘవ్‌జీ పటేల్, కనూభాయ్ దేశాయ్, కిరిత్‌సిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్‌సిన్హ్ చౌహాన్‌లు మంత్రి పదవులను దక్కించుకున్నారు.