ట్యాంక్ బండ్, వెలుగు: బీసీ సబ్ ప్లాన్, బీసీ అత్యాచారాల నిరోధక చట్టం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ ఈ నెల 13న అశోక హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను బీసీ నేతలు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ తదితరులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మెర ఘటన వంటివి పునరావృతం కాకుండా కఠినమైన బీసీ యాక్ట్ తీసుకురావాలని, కుల సంఘాల భవనాలు, రాజీవ్ యువశక్తి పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.
