తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు..9మంది పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు

తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు..9మంది  పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు

ఆరేళ్ల క్రితం తండ్రీకొడుకుల తాకప్ డెత్ కేసు.. న్యాయం కోసం బాధితుల కుటుంబం సుదీర్ఘ పోరాటం..చివరికి న్యాయమే గెలిచింది.  అకారణంగా  తండ్రీకొడుకులను లాకప్ లో ఉంచి వారి మరణానికి కారణమైన పోలీసులు దోషులుగా బోనులో నిలబడ్డారు. 2020లో వ్యాపారి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ కస్టడీ మరణాల కేసులో నిందితులైన తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని తమిళనాడు మదురై జిల్లా కోర్టు సోమవారం దోషులుగా నిర్ధారించింది. మార్చి 30న కోర్టు శిక్షపై నిర్ణయం తీసుకోనుంది. 

దోషులుగా తేలిన వారిలో ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు పి రఘు గణేష్ , కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్ మురుగన్ , ఎ సామిదురై, కానిస్టేబుళ్లు ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, మరియు ఎస్ వేలుముత్తు ఉన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో మహమ్మారి కారణంగా కానిస్టేబుల్ పాల్ దురై మరణించారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం, దోషిగా నిర్ధారించడంలో కీలకమైంది.

ఏంజరిగిందంటే.. 

లాకప్ డెత్ కు సంబంధించిన ఈ కేసు జూన్ 19, 2020 నాటిది. కోవిడ్  తో లాక్ డౌన్ విధించిన టైం. సత్తన్‌కుళంలో మొబైల్ షాప్ నడుపుతున్న జయరాజ్ ,బెనిక్స్‌లను, లాక్‌డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి తమ దుకాణాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ ఆరోపణ తర్వాత అబద్ధమని తేలింది.

తూత్తుకుడి జిల్లాలోని సత్తన్‌కుళం పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ లను  రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. చిత్రహింసల వల్ల వారికి అయిన తీవ్ర గాయాలను పట్టించుకోకుండా, స్థానిక మేజిస్ట్రేట్ వారిని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడంతో, కోవిల్‌పట్టి సబ్ జైలులో బంధించారు. అయితే ఆ తర్వాతి రెండు రోజుల్లో తండ్రీకొడుకులిద్దరూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడి, జూన్ 22, 23 తేదీలలో ఆసుపత్రిలో మృతిచెందారు. 

ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటా గా స్వీకరించి నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అప్పట్లో పెద్ద ఎత్తున్ విమర్శలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి, 24 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేసింది.

చిత్రహింసతో పాటు, సాక్ష్యాలను ధ్వంసం చేయడం ,అధికార దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు రుజువు కావడంతో మార్చి 23, 2026న సత్తన్‌కుళం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్సైతో సహా 9 మంది  పోలీసులను దోషులుగా తేల్చింది కోర్టు. మార్చి 30న దోషులకు శిక్షను ఖరారు చేయనుంది. ఇటీవల జరుగుతున్న  కస్టడీ హత్యలకు ఈ తీర్పు ఓ హెచ్చరికగా నిలవబోతోంది.