సారు ఏం మారలేదని మనోళ్లంటున్నరు

సారు ఏం మారలేదని మనోళ్లంటున్నరు
  • సీఎం కాంగనె సల్లవడ్డడనుకున్నరు
  • ఒరిజినల్ అట్లే ఉందని మెసేజ్​లు పంపుతున్నరు
  • ఉద్యమాలు చెయ్యక శానా రోజులైంది
  • మనోళ్ల చేతులు కూడా గులగుల అంటున్నయి
  • దుష్ప్రచారాలను, ‘సోషల్’ సొల్లును తిప్పికొడుదం
  • ఒక్క మాటంటే వెయ్యి గొంతులతో తిరగబడుదం
  • టీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

కామారెడ్డి, వెలుగు: ‘‘సీఎం కాంగనె కేసీఆర్ ​సాఫ్ట్​ అయిపోయిండేమో, సల్లవడ్డడేమో అని అనుకున్నారు. కానీ లోపల ఒరిజినల్ అట్లే ఉన్నది. ఏం మారలే. (ఆయన మాట్లాడింది) నిన్న మొన్న పేపర్లలో చూసినం. చదువుతుంటె గమ్మత్తుగ అనిపించింది. మళ్లా ఉద్యమం నాటి కేసీఆర్​ను చూసినట్టు అనిపిచ్చిందని చాలామంది మెసేజులు పంపిస్తున్నరు. మళ్లా పాత కేసీఆర్ యాదికొచ్చిన్రని మనోళ్లు చాలామంది చెబుతున్నరు’’ అని టీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘వడ్లను కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా12న ఆందోళన చేయాలని కేసీఆర్​పిలుపిచ్చిన్రు. కేంద్రం మెడలు వంచేలా మళ్లొక్కసారి పోరాడుదం. మనం తెలంగాణ  తెచ్చినోళ్లం. గట్టిగ అనుకుంటె కేంద్రం మెడలొంచుడు పెద్ద కష్టమేం కాదు. ఉద్యమాలు చేయక, రోడ్లెక్కక చాలా రోజులైంది. మనోళ్ల చేతులు కూడా గులగుల అంటున్నయి. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా ఆందోళనల్ల పెద్ద ఎత్తున పాల్గొందాం. కామారెడ్డి పార్టీ శ్రేణులు భారీగా కదం తొక్కాలె” అని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 12న కదం తొక్కుదాం. రైతుల కోసం విజృంభించి పోరాటం చేద్దాం” అన్నారు. కేటీఆర్ మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. బీబీపేట మండల కేంద్రంలో స్కూల్​ బిల్డింగును ప్రారంభించారు. తర్వాత జిల్లా కేంద్రంలో కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్​ విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగులో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై, స్టేట్ బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వడ్లు కొనబోమని, వరి బదులు ఇతర పంటలు వేసుకొనేటట్టు రైతులను ప్రొత్సహించాలని ఢిల్లీ బీజేపోళ్లు చెప్తరు. స్టేట్ల సిల్లీ బీజేపోళ్లేమో మన రైతులకు వరే వేసుకొమ్మని చెప్తరు. కేంద్రం పంజాబ్​ వడ్లనేమో కొంటదట. అక్కడో నీతి, తెలంగాణకో నీతా?” అంటూ ఫైరయ్యారు.
చూసొద్దాం, వస్తవా సంజయ్?
‘‘బీజేపోళ్లు చిత్ర విచిత్రమైన మనుసులు. నిన్నా మొన్న వాళ్ల మాట్లాడుడు సూస్తె గమ్మత్తనిపిచ్చింది. తెలంగాణల జరిగే డెవలప్ మెంట్​వర్క్స్, పథకాలు అన్ని వాళ్లయేనంటరు. అదే నిజమైతే బీజేపీ పాలిత స్టేట్లల్ల ఇవన్నీ ఎందుకు అమలైతలెవ్వు? ఆ స్టేట్లకు పొయ్యి చూసొద్దాం పా! వస్తవా?” అని స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్​ని ఉద్దేశించి కేటీఆర్​ అన్నారు.  ‘‘రైతులకు కేసీఆర్​ఏం చేసిండని బీజేపోళ్లంటున్నరు. తెలంగాణల రైతులకు మనం పెట్టుబడి సాయం ఇచ్చినంకనే కదా దాన్నే కాపీ కొట్టి కేంద్రం కిసాన్ సమ్మాన్​యోజన తెచ్చింది! ఓ దిక్కు ఇసొంటియి చేసుకుంట, టీఆర్ఎస్ సర్కారు రైతులకు ఏం చేసిందని విమర్శలు చేస్తానికి సిగ్గుండాలె” అంటూ దుమ్మెత్తిపోశారు. 
కాంగ్రెసోళ్లు గడ్డి కూడా పీకలే
రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ​డెవలఫ్​మెంట్​చేసుడు కాదు కదా, గడ్డి కూడా పీకలేదని కేటీఆర్ అన్నారు. ‘‘తెలంగాణ వచ్చిన ఈ ఏడేండ్లల్ల ఏం చేసిండ్రని కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? సిగ్గు మానం లేకుండ మాట్లాడుతున్నరు. రైతాగానికి విడతలవారీగా  కరెంటిచ్చిన ఘనత కాంగ్రెస్​కే దక్కింది” అంటూ దుయ్యబట్టారు.
నాల్కలు కోస్తం: ప్రశాంత్ రెడ్డి
విపక్ష నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని మంత్రి ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. ‘‘కేసీఆర్​పై, టీఆర్ఎస్​పై విమర్శలు చేస్తే పార్టీ శ్రేణులు చూస్తు ఊరుకోరు. అనవసర విమర్శలు చేసే వారి నాలుకలు కొసేదాకా ఊకోం. అపోజిషనోళ్లను టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా నిలదీయాలె. విశ్వరూపం చూపాలె” అని పిలుపునిచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ నేతలు మీటింగ్ లో  పాల్గొన్నారు.
కామారెడ్డికి గోదావరి జలాలు: కేటీఆర్
కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియాలకు గోదావరి జలాలు తెచ్చి తీరుతామని కేటీఆర్​ అన్నారు. ‘‘టీఆర్ఎస్​ ఆవిర్భావ సమయంలో పార్టీని ఎంతో ఆదరించిన చరిత్ర కామారెడ్డిది. ఇప్పటికే జిల్లా కేంద్రం చేసినం. మరింత డెవలప్ చేస్తం. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని సాగు, తాగు నీళ్లు, ఇతర రంగాల్లో అభివృద్ధి చేసినం. ఇక విద్య, వైద్య రంగాలకు ప్రయారిటీ ఇస్తం” అన్నారు. బీబీపేట మండల కేంద్రంలో దాత సుభాష్​రెడ్డి రూ.6 కోట్లతో కట్టించిన హైస్కూల్​బిల్డింగ్​ను మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ‘‘చాలామంది దగ్గర పైసలుంటయి. కానీ సేవకు ముందుకు రారు. సుభాష్ రెడ్డి తాను చదివిన స్కూలుకు కొత్త బిల్డింగ్​కట్టించడం అభినందనీయం” అన్నారు. తన నాయనమ్మ ఊరు బీబీపేట మండలం కోనాపూర్​ గవర్నమెంట్​ స్కూల్​ను శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో డెవలప్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. బీబీపేటకు జూనియర్​ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ప్రకటించారు.