బీసీలంతా ఏకమై నీలం మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు

బీసీలంతా ఏకమై నీలం మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు

ముషీరాబాద్/పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: బీసీలంతా ఏకమై మెదక్ కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి విద్యానగర్​లోని ఇంట్లో ఆర్.కృష్ణయ్యను నీలం మధు మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు. లోక్​సభ ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మధుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా మెదక్​ప్రాంతంలో అగ్రవర్ణ నేతలే రాజ్యమేలుతున్నారని, ఈసారి బీసీ యువనేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం హర్షణీయమన్నారు.

మెదక్​లోక్​సభ స్థానం పరిధిలో 64 శాతం బీసీల ఓట్లు ఉన్నాయని చెప్పారు. నీలం మధుకు అండగా నిలిస్తే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో బీసీల గొంతుకగా పోరాడుతారన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నీలం మధుకు టికెట్ కేటాయించిన కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్యతోపాటు బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, సుధాకర్, నంద గోపాల్, వేముల రామకృష్ణ నీలం మధును శాలువాలతో సన్మానించారు.