బీసీలంతా ఏకం కావాలి: తీన్మార్ మల్లన్న

బీసీలంతా ఏకం కావాలి: తీన్మార్ మల్లన్న
  • కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి: తీన్మార్ మల్లన్న
  • రాజ్యాధికారంలో బీసీల్లేరు:మధుసూదనా చారి
  • అన్ని రంగాల్లో రిజర్వేషన్లుఅమలు చేయాలి: బండ ప్రకాశ్
  • బీసీ కుల గణన, రిజర్వేషన్ల పెంపు సదస్సులో వక్తల కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపైకి రావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ గాంధీ కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా గెలుపొందడంలో బీసీలు కీలక పాత్ర పోషించారని అన్నారు. ‘‘బీసీ కుల గణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు”అనే అంశంపై తెలంగాణ బీసీ మేధావుల ఫోరం మంగళవారం తాజ్​కృష్ణలో సదస్సు నిర్వహించింది. 

ఫోరం అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు. ‘‘నా గెలుపుకు బీసీలు ఎంతో సహకరించారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కుల గణనతోనే ఇది సాధ్యమవుతుంది’’అని అన్నారు. దేశాన్ని శాసిస్తున్నది డబ్బు, రాజ్యాధికారమే అని మాజీ స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. దేశంలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నప్పటికీ.. రాజ్యాధికారంలో మాత్రం లేరన్నారు.  75 ఏండ్ల తర్వాత పొలిటికల్ పార్టీలకు బీసీలు గుర్తుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వారందరూ.. ఒకప్పుడు బీసీల వ్యతిరేకులు అని మండిపడ్డారు. 


బీసీలందరూ కలిసి ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని అన్నారు. సదస్సులో నేతలు చెరుకు సుధాకర్ గౌడ్, వీ.హన్మంత్ రావు, సామల వేణు తదితరులు పాల్గొన్నారు.