ఇయ్యాల, రేపు బ్యాంకుల సమ్మె

ఇయ్యాల, రేపు బ్యాంకుల సమ్మె

న్యూఢిల్లీ: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు సమ్మె కంటిన్యూ అవనుంది. సమ్మె నిర్వహణపై కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటన చేసింది. సమ్మెకు మద్దతుగా పలు సంఘాలు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నాయి. కార్మిక చట్టాల్లో ప్రతిపాదిత సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్, ఉపాధి హామీ నిధుల్లో కోతలకు వ్యతిరేకంగా, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణను డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తున్నామని తెలిపింది ఫోరం. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, తపాలా, ఆదాయపు పన్ను, కాపర్, బ్యాంకులు బీమా తదితల రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. రోడ్డు రవాణా, విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనగా.... రైల్వేలు, రక్షణ రంగాల్లోని యూనియన్లు సమ్మెకు మద్దతు ప్రకటించాయి..

ఉమ్మడి ఫోరంలో ఐఎన్ టీయూసీ, హెచ్ ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ సంఘాలున్నాయి. సమ్మెకు మద్దతిస్తున్నామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య తెలిపింది. సమ్మె కారణంగా రెండ్రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై పాక్షిక ప్రభావం పడొచ్చని SBI సహా పలు బ్యాంకులు ప్రకటలు విడుదల చేశాయి. సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు తాము మద్దతు ఇవ్వట్లేదని ఉత్తర్వులిచ్చింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.  

సమ్మె వల్ల విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. విద్యుత్ గ్రిడ్ 24 గంటలు సాధారణంగా నడిచేందుకు వీలుగా అన్ని ఉత్పత్తి సంస్థలు, ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు నిరంరంత పనిచేసేలా చూసుకోవాలంది. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి.. నిరంతరం సమాచారం అందించే ప్రయత్నం చేయాలంది.