
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలాకు ఫర్లో (సెలవు) లభించడంపై సెటైర్లు వేశారామె. బీజేపీ అవినీతి పరులను కడిగే పనిలో ఉందంటూ వ్యాఖ్యానించారామె.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు 6 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీకి సహకరించేందుకు జేజేపీ సిద్ధమైంది. జేజేపీ చీఫ్ దుష్యంత్ కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయడంతో ప్రభుత్వంలో చేరేందుకు డీల్ సెట్ అయింది.
ఈ సమయంలో దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలాకు శనివారం ఫర్లో మంజూరు కావడంతో ప్రియాంక గాంధీ.. బీజేపీపై సెటైర్ వేశారు. ‘అఖిల భారతీయ కరప్షన్ వాషింగ్ మెషీన్ ఆన్ అయింది’ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. దానితో పాటు అజయ్ చౌతాలాకు 14 రోజుల పాటు ఫర్లో లభించిన వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
1999-2000 మద్య జరిగిన ఓ అవినీతి కేసులో అజయ్ చౌతాలా, ఆయన తండ్రి ఓం ప్రకాశ్ చౌతాలా.. తీహార్ జైలులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.