
ఆర్మూర్, వెలుగు : రైతులకు సరిపడా యూరియా, డీఏపీ సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్, కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు. గురువారం ఆర్మూర్ లో మీడియాతో మాట్లాడారు. యూరియా సప్లై లో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపైఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. జూన్ నెలలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ అవసరం ఉందని నిపుణులు అచనా వేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు పంపిందన్నారు.
వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, సహకార సంఘాల పాలకవర్గాలు, డీసీఎంఎస్ అధికారులు యూరియాను మార్కెట్ లో బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద క్యూ కడుతున్నారన్నారు. ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి. కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకుల గంగారాం, జిల్లా ఉపాధ్యక్షుడు యు. రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు జక్కం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.