ట్రంప్ పొగడ్తకు గర్వంగా ఫీల్ అవ్వాలి.. లేకుంటే భారతీయులే కాదు

ట్రంప్ పొగడ్తకు గర్వంగా ఫీల్ అవ్వాలి.. లేకుంటే భారతీయులే కాదు
  • మోడీని ఫాదర్ ఆఫ్ ఇండియా అన్న ట్రంప్
  • పార్టీలకతీతంగా గర్వపడాలన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
  • మరో ‘క్వాలిఫికేషన్’ అంటూ నెటిజన్ల సెటైర్లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తల్లో ముంచెత్తడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఫ్రాంక్ గా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అమెరికా అద్యక్షుడు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జితేంద్ర సింగ్  మీడియాతో మాట్లాడారు. ట్రంప్ పొగడ్తలపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా భారతీయులంతా గర్వించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏ దేశ ప్రధానిని పొడగని రీతిలో తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు ఇలా ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’ అని మోడీని అన్నారని కేంద్రమంత్రి అన్నారు. ఒక వేళ ఎవరైనా సరే దీన్ని గర్వకారణంగా భావించకపోతే అలాంటి వారు అసలు భారతీయులే కాదని అన్నారు.

సోషల్ మీడియాలో దుమారం

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దుమారం రేగింది. భారతీయతను నిరూపించుకోవడానికి మరో ‘క్వాలిఫికేషన్’ వచ్చేసిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే, ‘అంటే ఇప్పడు ప్రధాని మోడీ.. మహాత్మ గాంధీకి రీప్లేస్ మెంటా?.. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా బీజేపీ ఆయనకు గొప్ప నివాళి అర్పిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.