నాయకులంతా జిల్లాల్లో తిరగాల్సిందే..హైదరాబాద్లో కూర్చుంటే అధికారంలోకి రాలేము

నాయకులంతా జిల్లాల్లో తిరగాల్సిందే..హైదరాబాద్లో కూర్చుంటే అధికారంలోకి రాలేము
  • బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్​లో రాష్ట్ర సహ ఇన్​చార్జి అభయ్ పాటిల్ 
  • నిధులు దుర్వినియోగం చేసిన వారిని వదిలేదిలేదని వార్నింగ్ 

హైదరాబాద్, వెలుగు: గల్లీల్లో తిరగకుండా స్టేట్, జిల్లా ఆఫీసుల్లోనే కూర్చుంటే రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని బీజేపీ రాష్ట్ర సహ ఇన్​చార్జ్ అభయ్ పాటిల్ రాష్ట్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పైరవీలు, మేనేజ్‌‌‌‌మెంట్లు చేసుకొని పదవులు తెచ్చుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. కష్టపడే వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. 

సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్​చార్జీల సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌‌‌‌, సహా ప్రధాన కార్యదర్శి దశరథ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కనీసం క్రియాశీల సభ్యత్వం కూడా లేని వారు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో కొనసాగడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.

 రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లకే జవాబుదారితనం లేకపోతే, ఇక జిల్లా అధ్యక్షులను ఏం అడుగుతామని నిలదీశారు. పార్టీలోని ముగ్గురు మినహా మిగతా అందరూ ఎప్పుడూ హైదరాబాద్‌‌‌‌లోని హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌కే పరిమితమవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అందరూ తప్పకుండా జిల్లా పర్యటనలు చేయాల్సిందేనని, తాము స్వయంగా పర్యవేక్షిస్తామన్నారు. 

నిధులు దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. 

మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులకు చేరాల్సిన నిధులను పూర్తిగా ఇవ్వకుండా దారి మళ్లించిన, దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అభయ్ పాటిల్ హెచ్చరించారు. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టించి, ఆ కేసులు కర్నాటకలో నమోదు చేయించి మరీ జైలుకు పంపిస్తానన్నారు. 

ఎవరెవరి వెనుక ఎవరున్నారో తమకు బాగా తెలుసునని చెప్పారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ ఎన్నికల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లాల అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధ్యక్షులు స్పందిస్తూ.. తమతో పాటు మున్సిపల్ ఎన్నికల ఇన్​చార్జీలను కూడా సమావేశానికి పిలిచి ఉంటే వాస్తవాలు తెలిసేవని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ సమావేశంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, సేవా సంకల్ప అభియాన్ తదితర అంశాలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

సామాన్యుల కష్టాలు తీరడం లేదు: రాంచందర్​రావు

గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకుంటూ బాగుపడ్డారే తప్ప సామాన్య ప్రజల కష్టాలు తీరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. 

కేసీఆర్ కుటుంబంలో అక్రమ ఆస్తుల పంపకాల కోసం పంచాయితీలు నడుస్తున్నాయని, ఇరు పార్టీలు ఒకరి దోపిడీని మరొకరు నిందించుకుంటూ నాటకమాడుతున్నాయని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను రక్షించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్‌‌‌‌లో భాగంగా ఈ నెల 7న ప్రతి జిల్లా కేంద్రంలో ‘సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.