డ్రగ్స్ వివాదంలోకి మొత్తం బాలీవుడ్‌‌ను లాగొద్దు

డ్రగ్స్ వివాదంలోకి మొత్తం బాలీవుడ్‌‌ను లాగొద్దు

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణం కీలకంగా మారింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హిందీ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌‌తోపాటు రకుల్ ప్రీత్ సిగ్ ఎన్సీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌‌లో డ్రగ్స్ వినియోగంపై వివాదం రేగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తొలిసారి ఓ బాలీవుడ్ బడా హీరో స్పందించాడు. ఈ విషయంపై ఖిలాడీ అక్షయ్ కుమార్ కామెంట్స్ చేశాడు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఈ వివాదాన్ని రుద్దొద్దని ఫ్యాన్స్, మీడియాను అక్షయ్ కోరాడు.

‘నేను బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నా. గత కొన్ని వారాల నుంచి నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. కానీ ప్రతి చోటా నెగిటివిటీ పెరిగిపోయింది. మమ్మల్ని స్టార్లుగా పిలుస్తారేమో కానీ బాలీవుడ్‌‌ను సృష్టించింది మీరే. ప్రజల ప్రేమతోనే ఇండస్ట్రీ క్రియేట్ అయింది. సినీ పరిశ్రమ భారత దేశ విలువలు, సంప్రదాయాన్ని ప్రపంచమంతటా చాటింది. ఇండస్ట్రీ ఎప్పుడూ సమాజానికి అద్దం పడుతూనే ఉంది. అలాగే అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంటి విషయాలపై సినిమాల్లో చర్చిస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధమైన విషయాల్లో ఉన్నారనే దాన్ని కొట్టిపారేయలేం. అయితే అందరూ విచారణకు సహకరిస్తున్నారు. ఈ సమస్య ఇండస్ట్రీలో లేదని నేను చెప్పలేను. అవును, అన్ని రంగాల్లోలాగే ఇక్కడా ఉంది. అయితే అన్ని రంగాల్లోనూ ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి సమస్యల్లో పాల్గొనరు. ఇది అసాధ్యం. డ్రగ్స్ అనేది లీగల్ విషయం. మన న్యాయస్థానాలు సరైనరీతిలో విచారణ చేస్తాయని నాకు నమ్మకం ఉంది’ అని అక్షయ్ చెప్పాడు.