గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్.. 13 జిల్లాల్లో కోలాహలం

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్..  13 జిల్లాల్లో కోలాహలం

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్‍ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. వరంగల్‍–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై పోల్‍ కోసం ఎన్నికల కమిషన్‍ షెడ్యూల్‍ ప్రకటించింది. దీంతో ఈ స్థానం పరిధిలోని 13 జిల్లాల్లో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. బీఆర్‍ఎస్​కు చెందిన సిట్టింగ్‍ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీచేసి, గెలవడంతో ఎమ్మెల్సీ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‍ పార్టీ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‍గా సత్తా చాటిన తీన్మార్‍ మల్లన్న పేరును ఇప్పటికే ప్రకటించి మరో ఎలక్షన్‍కు సై అంటున్నది. బీఆర్‍ఎస్‍, బీజేపీ నుంచి ప్రధానంగా ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు.

13 జిల్లాల్లో.. 4,61,806 మంది ఓటర్లు

వరంగల్‍–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ బై ఎలక్షన్‍ కోసం మే 2న నోటిఫికేషన్‍ విడుదల కానుంది. అదేరోజు నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుంది. అదే నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‍ నిర్వహిస్తారు. జూన్‍ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిల వరంగల్‍, హనుమకొండ, ములుగు, జయశంకర్‍ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‍, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 4,61,806 మంది గ్రాడ్యుయేట్‍ పూర్తి చేసిన ఓటర్లు ఉన్నారు.

బీజేపీ నుంచి ప్రకాశ్‍రెడ్డి, ప్రేమేందర్‍రెడ్డి, శ్రీచరణ్‍ 

బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రకాశ్‍రెడ్డి పేరు వినపడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‍రెడ్డికి సన్నిహితునిగా అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే టైంలో గతం ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర జనరల్‍ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలో నిలిచి 40 వేలకు పైగా ఓట్లు సాధించాడు. వీరిద్దరిని కాదని.. ప్రైవేట్‍ విద్యాసంస్థలు, కస్తూరి ఫౌండేషన్‍ నిర్వాహకుడు శ్రీచరణ్‍ పేరు వినపడుతోంది. పేద విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శ్రీచరణ్​కు ఓయూ ఏబీవీపీ విద్యార్థి నేతగా పార్టీ పెద్దలు, ఆర్‍ఎస్‍ఎస్‍ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి.

బీఆర్‍ఎస్‍లో ఏనుగుల రాకేశ్‍రెడ్డి, సుందర్‍రాజ్‍

మొన్నటి వరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి రూపంలో ఇది బీఆర్‍ఎస్‍ పార్టీకి సిట్టింగ్ సీటుగా ఉంది. మరోసారి తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకోడానికి ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్‍తో పాటు నల్గొండలో పట్టు ఉన్న పల్లా తన మనిషిగా అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‍రెడ్డి పేరును ప్రపోజ్‍ చేస్తున్నారు. ఇదే స్థానం కోసం తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మాజీ ‘కుడా’ చైర్మన్‍ సుందర్‍రాజ్‍ యాదవ్‍ సైతం పోటీ పడుతున్నారు. మాజీ ప్రభుత్వ చీఫ్​ విప్‍ దాస్యం వినయ్​ భాస్కర్‍ ప్రధాన అనుచరునిగా.. మాస్టర్‍జీ విద్యాసంస్థల అధినేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో పార్టీ టికెట్‍ కోసం ఓ విధంగా పల్లా, దాస్యం మధ్య పోటీ నెలకొన్నట్లయింది.

జోష్‍తో తీన్మార్‍ మల్లన్న

వరంగల్‍-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జర్నలిస్ట్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తీన్మార్‍ మల్లన్న (చింతపండు నవీన్​ కుమార్‍) పేరును కాంగ్రెస్​ ప్రకటించింది. 2015లో ఇదే ఎమ్మెల్సీ కోసం పోటీ చేసిన మల్లన్న 13,033 ఓట్లు పొందారు. 2021లో రెండోసారి బరిలో దిగి తనదైన సత్తా చాటారు. 84,118 మొదటి ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తంగా లక్ష 49 వేల ఓట్లు సాధించారు. తర్వాత కాంగ్రెస్‍ పార్టీలో చేరారు. ఈసారి ఫీల్డ్​లో గతంలో కంటే ఎక్కువ మద్దతుతో జోష్‍తో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మేధావులు, గ్రాడ్యుయేట్‍ జేఏసీ సంఘాల సపోర్ట్ అదనపు బలం.