ముగిసిన అఖిలపక్ష సమావేశం

ముగిసిన అఖిలపక్ష సమావేశం

రేపట్నుంచి లోక్ సభా సమావేశాలు ప్రారంభం కానుండడంతో… అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభ లీడర్ థావర్ చంద్ గెహ్లాట్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, ఇతర పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, లోక్ సభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.

పార్లమెంట్ సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పక్షాలను కోరారు మోడీ. అన్ని పార్టీల నుంచి సలహాలు వచ్చాయని… వాటిని స్వీకరించామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఈ సారి లోక్ సభకు అనేకమంది కొత్తవారు ఎన్నికయ్యారని… ఆలోచనలు కూడా కొత్తగా ఉండాలన్నారు మోడీ. అలాగే 19న అన్ని పార్టీల అధ్యక్షులను పార్లమెంట్ లో సమావేశానికి పిలిచారు మోడీ. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కు సంబంధించి ఆ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల గురించి కూడా చర్చిస్తారని ప్రహ్లాద్ జోషీ తెలిపారు.