మూడు పార్టీల్లోనూ తేలని మెదక్

మూడు పార్టీల్లోనూ తేలని మెదక్
  •    మూడు పార్టీల్లోనూ తేలని మెదక్
  •     అభ్యర్థులపై   ప్రధాన పార్టీల్లో  మల్ల గుల్లాలు. 
  •     షార్ట్​ లిస్ట్​ రెడీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ
  •     ప్రత్యర్థులను బట్టి  అభ్యర్థులను ఖరారు చేసే యోచన 

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఒకటిరెండు రోజుల్లో పార్లమెంట్​ఎన్నికల షెడ్యూల్​ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతుండగా ..    మెదక్  సీటుపై ప్రధాన పార్టీలు ఇంకా  తమ అభ్యర్థులను తేల్చలేదు. దీంతో  ఆయా పార్టీల ఆశావహులు టెన్షన్​ పడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు  మూడు పార్టీల పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.  తమ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నవారు, గెలిచే అవకాశాలు ఉన్నవారి పేర్లను పరిశీలించిన  బీఆర్ఎస్ , కాంగ్రెస్,  బీజేపీ హైకమాండ్లు  షార్ట్ లిస్ట్  తయారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది తేలిన తర్వాతే తమ అభ్యర్థిని ఖరారు చేయాలని అన్ని పార్టీలు వేచిచూస్తున్నాయి.

ఉమ్మడి మెదక్​ జిల్లాలోని  జహీరాబాద్   స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్​  తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించగా..  బీఆర్ఎస్ అభ్యర్థి కూడా దాదాపు ఖరారయ్యారు.  కానీ   మెదక్​లో  మాత్రం ఇంకా ఏ  పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు.  ఇక్కడ గెలవాలని మూడు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.  బీఆర్ఎస్ నుంచి  ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ మాజీ చైర్మెన్​ వంటేరు ప్రతాప్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి  టికెట్​ రేసులో ఉన్నారు.  ఇందులో ప్రతాపరెడ్డికి అవకాశం రావచ్చునని  పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రతాపరెడ్డికి అనుకూలంగా  కొద్దిరోజులుగా బీఆర్​ఎస్​ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి  హైకమాండ్​ ఆయనవైపే మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు.  ఇటీవల  సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే పరిస్థితి బీఆర్ఎస్​కే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ పార్లమెంట్​ ఎన్నికలు కావడానికి తోడు  బీజేపీ, కాంగ్రెస్​ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపితే ప్రతాపరెడ్డి, రాజనర్సులాంటి క్యాండేట్ల బలం సరిపోదని హైకమాండ్​ భావిస్తోంది. అందువల్ల వీలును బట్టి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని పరిశీలించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్​ బీసీ లీడర్​ నీలం మధు కు టికెట్​ ఇస్తే ప్రతాపరెడ్డికి బదులు రాజనర్సును బరిలోకి దింపవచ్చని భావిస్తున్నారు. 
 

బీజేపీలో ముగ్గురు ​   

బీజేపీ టికెట్ ను  చాలామంది​ఆశిస్తున్నప్పటికీ  దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, గజ్వేల్ కు చెందిన దారం గురువారెడ్డి, పటాన్​ చెరుకు చెందిన  అంజిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తనకు అవకాశం వస్తుందని ధీమాగా ఉన్న రఘునందన్​ రావు చాలా రోజుల నుంచి నియోజకవర్గమంతటా  పర్యటిస్తున్నారు.  పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంజిరెడ్డి కూడా  హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు  ముమ్మర ప్రయత్నాలు  చేస్తున్నారు.  గురువారెడ్డి  తనకున్న పరిచయాల ద్వారా  టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు.

 కాంగ్రెస్​ టికెట్ బీసీకా, ఓసీకా.. 

కాంగ్రెస్ టికెట్ కోసం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పటాన్ చెరు ప్రాంతానికి చెందిన  ముదిరాజ్ నేత నీలం మధు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీలకు టికెట్​ ఇవ్వాలనుకుంటే నీలం మధుకే  ఛాన్స్​దక్కవచ్చు. లేదంటే ..  ప్రత్యర్థులను  ఎదుర్కొనే  ఆర్థిక, అంగ బలంతో పాటు  నియోజకవర్గంలో  గుర్తింపు ఉన్న మైనంపల్లి హన్మంతరావు​కు అవకాశం ఇవవ్వచ్చునని అంటున్నారు.  బీఆర్ఎస్​రాజనర్సుకు టికెట్​ఇస్తే కాంగ్రెస్​ నుంచి నీలం మధుకు అవకాశం దక్కవచ్చు.