మున్సి‘పోల్‌‌’కు అన్ని పార్టీలు రెడీ

మున్సి‘పోల్‌‌’కు అన్ని పార్టీలు రెడీ
  • టికెట్ల ప్రయత్నాల్లో ఆశావాహులు
  • హైకోర్టు తీర్పుతో మొదలైన కసరత్తు
  • నవంబర్‌‌లో  నోటిఫికేషన్ జారీ అవకాశం

రంగారెడ్డి జిల్లా, వెలుగు:

మున్సిపల్‌‌ ఎన్నికలపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రాజకీయపార్టీల్లో  ఆశావాహుల్లో సందడి నెలకొంది.   రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌‌ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎన్నికల కమిషన్‌‌కు సూచించడం, మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వి.నాగిరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించడంతో ఎన్నికల వేడి పుంజుకుంది.  ఆశావాహులు పార్టీ టిక్కెట్ల వేటలో పడ్డారు. మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్ల పరిధిలో నేతల ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  నవంబర్‌‌ లో మున్సిపల్‌‌ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే  అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరోవైపు మునిసిపల్‌‌ ఎన్నికలకు ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తున్నది. ఇప్పటికే వార్డుల విభజన, జనగణన ఆధారంగా ఓటర్‌‌ జాబితాలను విడుదల చేసింది. రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది.

పోటాపోటీగా పార్టీల కసరత్తు

మున్సిపాలిటీల్లో పైచేయి సాధించేందుకు టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌, బీజేపీలు అంతర్గత సమావేశాలతో ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.  ఇప్పటికే కాంగ్రెస్‌‌ పార్టీ ముఖ్య నాయకులు పలు ధపాలుగా కాంగ్రెస్‌‌ కార్యకర్తలతో  సమావేశాలు నిర్వహించింది.  అధికార పార్టీ  టీఆర్‌‌ఎస్‌‌ సైతం   కార్యాచరణను సిద్ధం చేసుకుంది. రంగారెడ్డి  జిల్లాలోని 12 మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్లను, 3 మున్సిపల్​ కార్పొరేషన్‌‌  ను దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.   ఎమ్మెల్యేలకు   మున్సిపల్‌‌ ఎన్నికలపై టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ సూచనలు చేసినట్లు సమాచారం. బీజేపీ నాయకులు తమ సత్తాను నిరూపించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.  నోటిఫికేషన్​ రాకకు ముందే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌‌ నుంచి బీజేపీలోకి భారీ చేరికలుంటాయనే ప్రచారం ఉంది.

 మున్సిపాలిటీలు ఇవే

రంగారెడ్డి జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి మొత్తం 12 మున్సిపాలిటీలు. 3 కార్పొరేషన్లు   ఉన్నాయి. వాటిలో పెద్ద అంబర్‌‌పేట, షాద్‌‌నగర్‌‌, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, తుర్కయంజాల్‌‌, ఆదిబట్ల, శంకర్‌‌పల్లి, నార్సింగ్‌‌, మణికొండ, శంషాబాద్‌‌, ఆమన్‌‌గల్లు, జల్‌‌పల్లి మున్సిపాలిటీలుకాగా, బడంగ్‌‌పేట, మీర్‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌లను కార్పోరేషన్లు ఉన్నాయి.

తాండూరులో 36 వార్డులు

తాండూరు :   తాండూరు మున్సిపాలిటీ ఎన్నికల కోసం నాయకుల్లో ఆసక్తి నెలకొంది.  1952లో ఆవిర్భవించిన తాండూరు మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం  36 వార్డుల పరిధిలో   59,858 మంది ఓటర్లు ఉన్నారు.  ప్రధానంగా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్ధుల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.  తాండూరు టౌన్​లో ముస్లింమైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం పార్టీకి రాజకీయంగా పట్టు ఉంది. అధికారపార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా చీలిక ఏర్పడింది. ఈ వివాదం పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మున్సిపల్​ మంత్రి కేటీఆర్​, జిల్లా మంత్రి సబిత వరకు వెళ్లింది.  తమ అనుచరులకు పార్టీ టిక్కెట్లు ఇప్పించేందుకు ఎవరికివారు ప్రయత్నాల్లో ఉన్నారు. 1985, 1995లో బీజేపీకి చెందిన వారే మున్సిపల్​ చైర్మన్లుగా గెలుపొందారు.   ఆధీమాతో అధికారపార్టీ నుంచి టిక్కెట్​ రాని వారు ప్రత్యాన్మయంగా బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి 9 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ​ చైర్మన్లు పగ్గాలు చేపట్టారు. రెండుసార్లు బీజేపీ, ఒక్కసారి టీఆర్​ఎస్​ దక్కించుకున్నాయి. 2014లో టీఆర్​ఎస్​ నుంచి చైర్​పర్సన్​  విజయలక్ష్మి రెండున్నరేండ్ల చైర్మన్​గా పనిచేసి మిగతా పదవీకాలాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు ఇచ్చే ప్రయత్నం ఎంఐఎంలో చీలికకు దారితీసింది. చీలిక సభ్యులు కాంగ్రెస్​కు మద్దతుఇవ్వడంతో  సునిత 2017లో చైర్​పర్సన్​గా గెలుపొందారు.   ఇటీవల ఎమ్మెల్యేతో పాటు ఆమెకూడా అధికారపార్టీలో చేరారు.

చేవెళ్ల మున్సిపాలిటీలో 15 వార్డులు

చేవెళ్ళ:  శంకర్​పల్లి మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయవేడి మొదలైంది.  గ్రామపంచాయతీగా ఉన్న శంకర్​పల్లిని  రామాంతపూర్​, సింగాపూర్​, బుల్కాపూర్​, పత్తేపూర్​ గ్రామాలను కలుపుతూ 2018 ఆగస్టులో రాష్ట్ర  ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది.   శంకర్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో  20, 620మంది జనాభా ఉండగా,  18,120మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 15 వార్డులు ఉన్నాయి.  వార్డుల రిజర్వేషన్ల ఇంకా ఖరారు కాకపోవడంతో స్థానిక నేతల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా శంకర్​పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీల మధ్యనే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మున్సిపల్​ ఎన్నికలకు సిద్ధంకండి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ నాగిరెడ్డి

వికారాబాద్​, వెలుగు :  మున్సిపల్​ ఎన్నికల నిర్వహణకు    సిద్ధం  కావాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్​ నాగిరెడ్డి  ఆదేశించారు.   మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్​కు వికారాబాద్​ కలెక్టర్​ అయేషా మస్రత్​ ఖానమ్, జేసీ అరుణకుమారి, మున్సిపల్​ కమిషనర్లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా   జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన కసరత్తును కలెక్టర్​ వివరించారు.   ఓటర్ల సంఖ్య ప్రకారం అవసరమైన పోలింగ్​ కేంద్రాలతో పాటు  ఓటరు జాబితాలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.    సిబ్బందికి  శిక్షణ ఇవ్వాలని, ఎన్నికల సామాగ్రి కోసం స్ట్రాంగ్​రూమ్స్​, రిసెప్షన్​ సెంటర్స్​, డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లా, వెలుగు :   రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌‌లో సూచించిన విషయాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌ హరీశ్​ వివరణ ఇచ్చారు.   జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను వివరించారు.  వీడియోకాన్ఫరెన్స్‌‌లో మున్సిపల్‌‌ కమిషనర్లు, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

All political parties prepare for municipal elections in greater hyderabad