సిర్పూర్ గడ్డపై ..బహుజన వాదం

సిర్పూర్ గడ్డపై ..బహుజన వాదం

ఆసిఫాబాద్, వెలుగు:  బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీతో అందరి చూపు సిర్పూర్ నియోజకవర్గంపై పడింది. జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్ నుంచి పోటీలో ఉంటానని ప్రవీణ్ కుమార్ ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటి వరకు ఇక్కడ త్రిముఖ పోరు తప్పదని భావించిన ఓటర్లు.. ప్రవీణ్​ కుమార్​ ఎంట్రీతో చతుర్ముఖ పోరు తప్పదని అంచనాలు వేస్తున్నారు. ఏయే పార్టీల ఓట్లు చీలనున్నాయో చర్చించుకుంటున్నారు.

ఎస్సీ, మైనారిటీ ఓట్లే ముఖ్యం

సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, బీసీ, మైనారిటీ ఓటు శాతం అధికం. ముఖ్యంగా ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పక్షాన నిలవడంతో ఆయన విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ హవాలోనూ బీఎస్పీ నుంచి పోటీ చేసిన కోనప్ప అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయం సాధించారు. ఆపై బీఆర్​ఎస్​లో చేరిన కోనప్ప 2018లో ఆ పార్టీ​ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, రానున్న ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న కోనప్పకు బీజేపీ లీడర్ పాల్వాయి హరీశ్ బాబు నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. తండ్రి పాల్వాయి పురుషోత్తం ఓటు బ్యాంకుతో పాటు బీజేపీ సంప్రదాయ ఓట్లను కాపాడుకునేలా ఆయన ఏడాది కాలంగా సిర్పూర్ నియోజకవర్గంలో విస్రృత పర్యటనలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ చీఫ్ ఆర్​ఎస్​ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం నియోజకవర్గ రాజకీయాల్లో అలజడి రేపుతోంది.

ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుకు గండి

బీఎస్పీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి సంప్రదాయంగా వస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకును ప్రవీణ్ కుమార్ కొల్లగొట్టే అవకాశం ఉంది. ఏడాది కాలంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య ఎంట్రీతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాన నిలబడుతున్న ఎస్సీ, మైనారిటీల ఓట్లను బీఎస్పీ చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తోపాటు బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోరు తప్పేలా లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో సిర్పూర్​లో ఎవరు గెలుస్తారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.