చెన్నైపై పంజాబ్‌  గ్రాండ్ విక్టరీ

చెన్నైపై పంజాబ్‌  గ్రాండ్ విక్టరీ
  •     రాణించిన లివింగ్‌స్టోన్‌, రాహుల్‌ చహర్‌

ముంబై: ఆల్‌‌‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌‌ కింగ్స్‌‌.. ఐపీఎల్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ చెన్నైకి చెక్‌‌ పెట్టింది. బ్యాటింగ్‌‌లో లివింగ్ స్టోన్ (32 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60) దంచికొట్టగా, బౌలర్లందరూ సమయోచితంగా రాణించడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 54 రన్స్‌‌ తేడాతో నెగ్గి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సీఎస్‌‌కేకు ఇది మూడో ఓటమి. టాస్‌‌ గెలిచి చెన్నై ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా.. పంజాబ్‌‌ 20 ఓవర్లలో 180/8 స్కోరు చేసింది. భారీ టార్గెట్ చేజ్ లో చెన్నై 18 ఓవర్లలో 126 రన్స్‌‌కే కుప్పకూలింది. శివమ్‌‌ దూబే (57) టాప్‌‌ స్కోరర్‌‌. రాహుల్ చహర్ (3/25), ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లివింగ్ స్టోన్ (2/25)  మెరిశారు.   

పంజాబ్​ పవర్ హిట్టింగ్

ముందుగా బ్యాటింగ్‌‌కు వచ్చిన పంజాబ్‌‌కు శుభారంభం లభించలేదు. మయాంక్ అగర్వాల్(4), రాజపక్స(9) తొందరగానే ఔటయ్యారు. కానీ లివింగ్ స్టోన్ బాదుడుతో టీమ్ కోలుకుంది. శిఖర్ ధవన్ (33) అతడికి సపోర్ట్ ఇచ్చాడు. ఐదో ఓవర్లో లివింగ్ స్టోన్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ తో 26 రన్స్ రాబట్టాడు. వీరి జోరుతో పవర్ ప్లేలో పంజాబ్ 72/2తో నిలిచింది. రాయుడు క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన లివింగ్ స్టోన్.. 10వ ఓవర్లో సిక్స్ బాది తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ వరుస విరామాల్లో ధవన్, లివింగ్ స్టోన్ ఔటైన తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ (6) నెమ్మదిగా ఆడగా జితేశ్ శర్మ (26) దూకుడుగా ఆడాడు. లోయర్‌‌ ఆర్డర్‌‌లో రబాడ (12 నాటౌట్‌‌), రాహుల్‌‌ చహర్‌‌ (12)  ఓ మాదిరిగా ఆడారు. లాస్ట్‌‌లో చెన్నై విజృంభించడంతో ఐదు ఓవర్లలో పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 33 రన్స్ మాత్రమే చేసింది. 

చెన్నై ఢమాల్

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి ఏదీ కలిసి రాలేదు. వైభర్ అరోరా (2/21) మంచి స్వింగ్ తో ఓపెనర్ ఊతప్ప(13)తో పాటు మొయిన్ అలీ (0)ని ఔట్ చేయగా.. రుతురాజ్(1), జడేజా (0), రాయుడు (13) విఫలమయ్యారు. 36/5తో కష్టాల్లో పడిన సీఎస్‌‌కేను ధోనీ (23), దూబే ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో చెన్నై 10 ఓవర్లలో 53/5 స్కోరు చేసింది. 14వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్ లు బాది తర్వాత సింగిల్ తో దూబే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే దూబేతో పాటు బ్రావో (0)ను లివింగ్ స్టోన్ పెవిలియన్‌‌కు పంపాడు. ప్రిటోరియస్ (8), ధోనీ, జోర్డాన్ (5)ను రాహుల్ చహర్ ఔట్ చేయడంతో పంజాబ్ విక్టరీ ఖాయమైంది.